27, ఆగస్టు 2011, శనివారం

SUMAN

కరాటే నేర్చుకునేది కొట్టడానికి కాదు.
ఎవరైనా కొడితే కాచుకోడానికి.
సుమన్ కరాటేలో బ్లాక్ బెల్ట్.
కానీ... జీవితం కొట్టబోయే దెబ్బలను
కాచుకునే శక్తి కోసం అతడికి
‘సంకల్పం’ అనే బెల్ట్ కావలసివచ్చింది.
సుమన్ ఆకాశాలను, నక్షత్రాలను చుంబించాడు.
పాతాళంలో పురుగుల మధ్య శయనించాడు.
కానీ... తట్టుకుని తీరాలి అనే సంకల్పాన్ని మాత్రం సడలనివ్వలేదు.
చీటికి మాటికి కలతపడి, కన్నీళ్లు పెట్టుకుని, గందరగోళ పడిపోయే
మనుషులందరూ సుమన్‌ని కుతూహలంగా చూడాలి.
అతడు పడిలేచిన వైనం చూసి రీచార్జ్ అవ్వాలి.


ఇంటర్వ్యూ, కథారూపం : ఖదీర్

ఓపికగా ఉండు.
ఎందుకంటే కాలం నీ కోసం ఏమేమి రిజర్వ్ చేసి పెట్టిందో నీకు తెలియదు.
అది గొప్ప కీడు కావచ్చు.
ఆ వెంటనే-
గొప్ప మేలూ కావచ్చు.

******

హీరో. ఆరడుగుల ఆజానుబాహుడు. అందగాడు. గిరజాల జుట్టువాడు. ఆడపిల్లల కలల రాకుమారుడు.
పెద్ద హవా. పెద్ద మార్కెట్. రేపో మాపో సూపర్ స్టార్ కావడానికి దూసుకుపోతున్నవాడు.
కాని కాలం లాగి పెట్టి కొట్టింది.
జైల్లో పడ్డాడు.
కీడు. చాలా కీడు.

******

హీరోగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. కొత్త తరం వచ్చేసింది. కొత్త ధోరణులు వచ్చేశాయి. కొత్త కథలూ వచ్చేశాయి. తనకు చోటు? లేదు. తన భవిష్యత్తు?
అప్పుడు ఒకరోజు తలుపు తట్టిన చప్పుడయ్యింది.
ఎవరో వేషం ఆఫర్ చేశారు.
ఏం వేషం?
వేంకటేశ్వర స్వామి!
జైలు శిక్ష అనుభవించిన ఒక ఖైదీని ఎట్టకేలకు దైవం కటాక్షించింది.
ఇంతకు మించి ఏం కావాలి?
గొప్ప మేలు.

******

అందుకే ఓపికగా ఉండు. కాలం- తేనెలో ముంచిన కత్తిని అందిస్తూ ఉంటుంది. తేనెను జుర్రుకో. కత్తిని జారవిడు.

******

తుళు మాట్లాడేవాళ్లంతా ఆచితూచి ఉంటారు. అతిగా ఆశపడరు. అల్పంగా ప్రవర్తించరు. ప్రతి పైసా జాగ్రత్తగా చూసుకోవాలి. పటాటోపాలకు దూరంగా ఉండాలి. ఇదీ వాళ్ల ధోరణి. అలాంటి తుళు కుటుంబంలో పుట్టాడు సుమన్. మంగుళూరు అతడి మాతృభూమి. పుట్టిపెరిగిందంతా సినీ జీవుల పుణ్యభూమి- మద్రాస్. మరికొద్దిరోజుల్లో బిఏ లిటరేచర్ పూర్తి చేయడం.... మరికొన్ని రోజుల్లో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవడం... అమ్మను బాగా చూసుకోవడం... చాలా సింపుల్ ప్లాన్.
కాని కాలం పన్నిన ప్లాన్ వేరే ఉంది. ఆ ప్లాన్ కొద్దీ అది అతడికి అందమైన రూపం ఇచ్చింది. ఆపైన సినిమా వాళ్ల కళ్లలో పడేలా చేసింది. పందొమ్మిదేళ్లకే సుమన్ హీరో. ఇంకో ఒకటి రెండేళ్ల తర్వాత తెలుగులో హీరో.
ఎలాంటి హీరో?
వయసైపోయిన హీరోల కాలంలో వయసుకొచ్చిన హీరో.
ముడతలు పడ్డ ముఖాల కాలంలో మెరుస్తున్న హీరో.
వదల్లేదు ఎవరూ.
సుమన్ కావాలి. సుమన్ హీరోగా యాక్ట్ చేయాలి. బిజీ. బిజీ. బిజీ. ఇక్కడ దాకా కాలం రానిచ్చింది. అప్పుడు చిన్న జర్క్ ఇచ్చింది.

******

1985 మే 19 అర్ధరాత్రి. మద్రాసు మోడల్ హౌస్‌రోడ్‌లో సుమన్ ఇల్లు.
మరి కాసేపటిలో గడియారం పన్నెండు కొడుతుందనుకుంటే తలుపు మీద దురదృష్టం కొట్టింది. .
టక్... టక్... టక్...
కుక్కలు మొరుగుతున్నాయి.
మళ్లీ చప్పుడు.
టక్... టక్... టక్.
సుమన్ తల్లి కేసరి ఉలిక్కిపడి లేచి తలుపు తీసింది. సుమన్ నిద్ర కళ్లతో మెట్లు దిగి వచ్చాడు.
ఎదురుగా పోలీసులు.
‘సార్... మీ ఇంట్లో ఎవరో బాంబు పెట్టారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సోదా చేయాలి’ అన్నారు.
సుమన్ చుట్టూ చూశాడు. ఇది నిజమా. కలా. పీడకలా?
పోలీసులు ఎవరి పర్మిషనూ తీసుకోకుండా తలో మూలకు పరుగెట్టి ఇల్లంతా సోదా చేశారు. బాంబు లేదు. కాని ఏదో జరగబోతోంది. ఎక్కడో బాంబు పేలబోతోంది.
‘సార్... మీరొక్కసారి స్టేషన్‌కి రాగలరా?’ అడిగారు.
ఎరను కబళించేముందు ఆక్టోపస్ తన మొదటి తొండాన్ని ఇలాగే స్నేహంగా అందిస్తుంది.
‘పొద్దున వస్తాను’
‘కాదు. ఇప్పుడే రావాలి. చిన్న ఫార్మాలిటి’ నసిగారు.
సుమన్ తల్లివైపు చూశాడు. ఏదో చిన్న న్యూసెన్స్... ఇప్పుడే వస్తాను అన్నట్టుగా బయలుదేరాడు.
సరిగ్గా అప్పుడు గడియారం కొట్టింది.
సుమన్ బ్యాడ్ టైమ్ మొదలయ్యింది.

******

కొన్ని సంతకాలు జీవితాంతం వెంటాడుతాయి. ముఖ్యంగా- పోలీస్ స్టేషన్‌లో పెట్టినవి.
సుమన్ తన జీవితంలో ఎన్నో ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. కాని మూడున్నర ఏళ్లపాటు తనని ఇబ్బంది పెట్టే ఆటోగ్రాఫ్ ఆరోజు స్టేషన్‌లో చేశాడు. పోలీసులు పెద్దగా ఏమీ మాట్లాడలేదు. కొన్ని కాగితాలు ముందర పెట్టి సైన్ చేయమన్నారు. సుమన్ చేయలేదు. సెల్‌లో ఉన్న ఎవణ్ణో పట్టుకొచ్చి చావబాది సైన్ చేయమన్నారు. సుమన్ చేయలేదు. ఈసారి సెల్‌లో ఉన్న మరొకణ్ణి పట్టుకొచ్చి మూతి పళ్లు రాలగొట్టారు. సైన్ చేయమన్నారు. సుమన్‌కు వేరే దారి లేదు. ఇది సినిమా స్టేషన్ కాదు. నిజం స్టేషన్. పోలీసులు ఎంతో దయతో ప్రాణాలు తీసేస్తారు. లొంగిపోయాడు. సైన్ చేశాడు.
అంతవరకూ వినయంగా ఉన్న ఇన్‌స్పెక్టర్ చిన్నగా నవ్వి అసలు సంగతి చెప్పాడు.
‘థ్యాంక్యూ. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం. సెల్‌లోకి నడవండి’.

******

సెక్షన్ 307- అటెంప్ట్ టు మర్డర్.
సెక్షన్ 420- ఛీటింగ్..
అదనంగా గూండా యాక్ట్.
అంతరాత్రి పూట కొంపలు మునిగిపోయినట్టుగా హాజరుపరిచాక స్పెషల్ మేజిస్ట్రేట్ అడుగుతుంటే సుమన్‌కు కళ్లు తిరిగాయి. వాళ్లు అభియోగాలు మోపి నేరం చేశానని చెబుతున్న డేట్స్‌లో తాను షూటింగ్ చేస్తున్నాడు. అయినా అరెస్ట్ చేస్తున్నారు. ఎవరిది ఈ కుట్ర? తనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ల పేర్లు ఎప్పటికీ బయటపెట్టలేడు.

******

బ్లూఫిల్మ్స్ కేసులో సుమన్ అరెస్ట్!
నూట ముప్పయ్ ఆరు చానల్స్‌లేని ఆ రోజుల్లో కూడా నూట డెబ్బయ్ ఆరు చానల్స్ ఉన్నంత తీవ్రంగా ఆ వార్త పేలింది. తమిళ ఇండస్ట్రీ షాక్. తెలుగుకు తడబాటు. అరెరె అనుకున్నారు ఆడవాళ్లు. అవునవునా అనుకున్నారు కుర్రాళ్లు. అంతవరకూ సుమన్ యాక్ట్ చేసిన- ‘ఇద్దరు కిలాడీలు’ చూసినవాళ్లు సుమన్ ఒక యాక్షన్ స్టార్ అనుకున్నారు. ‘పండంటి కాపురానికి 12 సూత్రాలు’ చూసినవాళ్లు సుమన్ ఒక ఫ్యామిలీ స్టార్ అనుకున్నారు. ‘నేటి’ భారతం చూసినవారు సుమన్ ఒక ప్రోగ్రెసివ్ స్టార్ అనుకున్నారు. ‘సితార’ చూసిన వాళ్లు సుమన్ ఒక రొమాంటిక్ స్టార్ అనుకున్నారు.
కాని- ఆఖరుకు- సుమన్ ఒక బ్లూ ఫిల్మ్ స్టార్ అని తేలింది.
కాలం పొడిచిన క్రూరమైన పచ్చబొట్టు ఇది.
దీనిని చెరుపుకోవడం ఎలా?

******

రేపు నువ్వు ఎలాంటి వాళ్లను కలవబోతున్నావో నీకు తెలియదు. సుమన్ తన జీవితంలో ఇలాంటి వాళ్లను కలవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. చిన్న సెల్ అది. అందులో చీకటి. అందులో దుర్వాసన. అందులో బొద్దింకలు. తోడుగా ఒక మర్డరర్. ఒక రేపిస్ట్. ఒక పాకెట్ మార్. వీళ్లతో కలిసి ఉండాలి తను. అక్కడే ఆహారం. అక్కడే విసర్జన. మెలకువలాంటి నిద్ర. నిద్రలాంటి మెలకువ. ఊచల్లో నుంచి సన్నటి వెలుగు పడితే ఓహో తెల్లారిందేమో అనుకోవడం. చీకటి చిక్కబడితే ఆహా రాత్రయ్యిందేమో అని ఉసూరుమనడం. ఖాళీగా ఉన్న బుర్ర దెయ్యాల దిబ్బ. జైల్లో ఉన్న బుర్ర పిశాచాల కార్ఖానా. వేలాది ఆలోచనలు అలా స్ప్లిట్ ఆఫ్ సెకండ్ రోల్ అయిపోతూ ఉండేవి. ఒక్కోసారి షూటింగ్‌లో ఉన్నట్టుగా భ్రాంతి. మరోసారి కట్ అని డెరైక్టర్ అరిచినట్టుగా ఇల్యూజన్. తనేమిటి? ఇక్కడ ఉండటం ఏమిటి?
రేపు బయటపడతాననుకున్నాడు తను. రేపు బెయిల్ దొరుకుతుంది అని ఆశపడ్డాడు తను. ఎల్లుండి రిలీజ్ గ్యారంటీ అని భావించాడతను.
కావడం లేదు. ఎప్పుడు అవుతాడో తెలియదు. బెయిల్ ఇస్తే ప్రమాదం అని పోలీస్ కమిషనర్ రిపోర్ట్ పంపాడు. ఎందుకు బెయిల్ ఇవ్వరు అని సుమన్ న్యాయపోరాటం మొదలుపెట్టాడు.
‘సుమన్ వెర్సస్ తమిళనాడు గవర్నమెంట్’.
చాలా పెద్ద డిబేట్.
న్యాయవర్గాల్లో ఈ కేస్ ఒక పెద్ద సంచలనం.

******

మీసాలు ఉన్నవాళ్లు మీసాలు ఉన్నట్టుగా ప్రవర్తించకపోతే ఒక్కోసారి ఆడవాళ్లే నడుం బిగించాల్సి వస్తుంది. సుమన్ లోపల ఉన్నప్పుడు చాలామంది మగవాళ్లు తప్పుకున్నారు. సుమన్‌దే తప్పయి ఉండవచ్చని చెప్పుకున్నారు. మనకెందుకు వచ్చిన గొడవ అని ముసుగు కప్పుకున్నారు.
కాని సుమన్‌తో కలిసి నటించిన ముగ్గురు హీరోయిన్లు మాత్రం దీనిని భరించలేకపోయారు. కాని ఇది ఎలాంటి కేసు. బ్లూ ఫిల్మ్స్ కేసు. యాక్సిడెంటో ప్రమాదమో అంటే ముందు ఉండి మాట్లాడినా ఒక రకం. దీని మీద మాట్లాడ్డం అంటే అలా మాట్లాడిన వాళ్లను కూడా సొసైటీ హీనపరుస్తుంది.
కాని ఆ హీరోయిన్లు సాహసించారు. క్రిక్కిరిసిన విలేకరులతో ప్రెస్‌మీట్ పెట్టారు.
‘సుమన్ అలాంటివాడు కాదు.’ అని గర్జించారు ఒక హీరోయిన్.
‘సుమన్ బ్లూఫిల్మ్స్ వ్యవహారంలో ఉంటాడంటే మేము నమ్మం’ అని కొట్టి పడేశారు ఇంకో హీరోయిన్.
‘ఇలాంటివాణ్ణి అరెస్ట్ చేసి లోపల వేయడం అన్యాయం’ అని కళ్లనీళ్లు పెట్టుకున్నారు ఇంకో హీరోయిన్.
వాళ్ల పేర్లు మరుసటి రోజు పేపర్లలో పెద్ద అక్షరాల్లో ప్రచురితం అయ్యాయి.
సుహాసిని. సుమలత. భానుప్రియ.
ఈ కష్టకాలంలో సుమన్ వెన్నుతట్టే చేతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

******

ఒక సమీరం వీచింది. జైలు కిటికీ దగ్గర హఠాత్తుగా ఒక పిట్ట కువకువలాడింది. ఏదో ఒక మంచి కబురు.
సుమన్ యాక్ట్ చేసిన ‘అమెరికా అల్లుడు, దర్జాదొంగ రిలీజయ్యాయి.
రెండూ హిట్.
జైల్లో హీరో. హాల్లో ప్రేక్షకులు. అమ్మయ్య... జనం విన్నదంతా నిజం అనుకోరు. చూసిందంతా వాస్తవమే అని భావించరు. సుమన్‌కు ధైర్యం వచ్చింది. జనంలో తను ఉన్నాడు. బయటికొస్తే సినిమాలు చేస్తాడు.
చిన్న ఆశ.
చాలా రోజుల తర్వాత సత్తుపళ్లెంలోని భోజనాన్ని సుమన్ ఒక్క మెతుకు కూడా వదలకుండా పూర్తి చేశాడు.

******

1985 అక్టోబర్ 1.
మధ్యాహ్నం పన్నెండైనట్టుగా గడియారం గంటలు కొట్టింది.
సుమన్‌కు గుడ్‌టైమ్ మొదలయ్యింది. బెయిల్!
నాలుగున్నర నెలల సుదీర్ఘకాలం తర్వాత జైలు నుంచి బయటకొచ్చిన సుమన్ ఆ పూట మద్రాసులో కాసిన సాధారణ ఎండకు కూడా బైర్లు కమ్మినట్టయ్యాడు.
ఈ వెలుగు చూసి ఎంత కాలమయ్యింది!
సుమన్ బైటకొస్తున్నాడంటే ఒకరిద్దరు నిర్మాతలు అంబాసిడర్లలో వచ్చి దూరంగా కాపు కాశారు. ఎలా ఉన్నాడో, ఎలా అయిపోయాడో, సినిమాలకు పనికొస్తాడో రాడో. కాని, సుమన్ అలానే ఉన్నాడు. అందంగా ఉన్నాడు. ఆపిల్- ఫ్రిజ్‌లో లేకపోతే ఏం? అది ఆపిలే కదా. ఈ సంగతి తెలిసి ఒకరిద్దరు హీరోలు భంగపడ్డారు. జైల్లోనే ఉండి కుంగి కృశించిపోయి ఏదేదో అయిపోతాడనుకుంటే అదేమీ కాకుండా...
‘ఇలా ఉండటం ఎలా సాధ్యమండీ’ అని అడిగాడో విలేకరి.
‘పరిస్థితిని ఎదిరించి’ అన్నాడు యింకో విలేకరి.
సుమన్ నవ్వాడు.
‘కాలం కాలుపట్టి మనల్ని ఈడుస్తున్నప్పుడు సరెండర్ అయిపోవాలి తప్ప తొడ కొట్టకూడదు. నేను కాలానికి లొంగిపోయాను. అది నన్ను లోపలేసింది. అదే నన్ను బయటకు తెచ్చింది’

******

ఇంకొకడైతే ఫినిష్ అయిపోయి ఉండేవాడు. ఇంట్లో దూరి తలుపులేసుకునేవాడు. దేశం వదిలి ఏ దుబాయ్‌లోనో హోటల్ మేనేజర్‌గా సెటిల్ అయిపోయి ఉండేవాడు. ముల్లు దిగిన చోటే కొత్త చెప్పులేసుకొని దర్జాగా తిరగాలి. అదీ హీరోయిజం. సుమన్ అందుకు సిద్ధపడ్డాడు. తెలుగు నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ తోడు నిలిచారు.
కాని పోలీసుల కండీషన్లు.
సిటీ దాటకూడదు. అర్ధరాత్రిళ్లు కనిపించకూడదు. నెలకోసారి సంతకం పెట్టాలి. పెద్దగా నవ్వకూడదు.
సుమన్ అన్నింటికి ఓకే అన్నాడు. ‘బందిపోటు’ మొదలైంది. రిలీజయ్యింది. హిట్ అయ్యింది.
ప్రేక్షకులు మళ్లీ తీర్పు చెప్పారు.
సుమన్ ఉన్నాడు. సుమన్ ఉంటాడు.

******

1988 డిసెంబర్ 26.
కోర్టు కేసు కొట్టేసింది.
మూడున్నర ఏళ్లు. హింస. కాని దానిని దాటేశాక సుమన్‌కు జీవితం ఇంకా అందంగా కనబడుతూ ఉంది. ఇన్‌ఫాక్ట్ జీవితం విలువ మొదటిసారి తెలిసి వచ్చింది. రోజూ చేసే పనులు... తినడం... పని చేయడం... స్నేహితులను కలవడం... వాటి విలువ తెలిసి వచ్చింది. సాధారణ జీవితంలో వాటిని మనం పట్టించుకోం. కాని, ఒక్కసారి జైల్లో పడితే తెలుస్తుంది కొన్ని కోట్లు ఇచ్చినా అవన్నీ దొరకవని.
సుమన్ నిశ్చయించుకున్నాడు. ఇక జీవితంలోని ప్రతి క్షణాన్ని జీవించాలి.

******

సుమన్ ఇప్పుడు హైద్రాబాద్ హీరో. చాలామంది మద్రాసులోనే తచ్చాడుతున్నప్పుడు నన్ను అభిమానించింది తెలుగువారు, నన్ను నిలబెట్టింది తెలుగువారు, నేను తెలుగు ప్రజల మధ్య ఉంటా అని హైద్రాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. అతడి ఆశనూ అంచనాలను తెలుగువారు వంచించలేదు. అతడి ప్రతి సినిమాను ఆదరించారు. 88లో మూడు. 89లో నాలుగు. 90లో ఆరు. 91లో ఐదు. 92లో ఆరు. సుమన్ సినిమాలు వరుసపెట్టి రిలీజ్ అవుతున్నాయి. 20 శతాబ్దం... దోషి నిర్దోషి... ఆత్మబంధం... పెద్దింటల్లుడు... మొండి మొగుడు పెంకి పెళ్లాం... కలెక్టర్‌గారి అల్లుడు... పరువు-ప్రతిష్ట... రెండిళ్ల పూజారి... మూడేళ్లల్లో ఎనిమిది హిట్లు. 1993లో ‘బావ-బావమరిది’ బ్లాక్ బస్టర్.
పాత గాయాలు మానిపోయాయి. పచ్చబొట్టు చెరిగిపోయింది. సుమన్ ఇప్పుడు ఏ మచ్చాలేని సుమన్. చాలు... ఇంతకు లేచాను పదివేలు అనుకున్నాడు సుమన్. హీరోగా అతడికి అవకాశాలు వస్తున్నాయి. జైలుకు వెళ్లాక మళ్లీ కెమెరానే చూడలేను అనుకున్నవాడికి ఇంత కెరీర్ మిగిలి ఉండటమే గొప్ప. ఇప్పుడు అవకాశాలు తగ్గితే మాత్రం ఏమి? అనుకున్నాడు సుమన్.
కాని కాలం అతడి కోసం ఇంకా చాలానే రిజర్వ్ చేసి పెట్టి ఉంది.

******

సుమన్ ఇంటికి ఒక రోజు ఇంద్రుడు ఊడిపడ్డాడు. ఇంద్రుడు అంటే సినిమా ఇంద్రుడు. దర్శకేంద్రుడు. రాఘవేంద్రరావు. సుమన్‌కు మాట రాలేదు. తేరుకునే లోపు రాఘవేంద్రరావు అన్నారు- నా అన్నమయ్యలో నువ్వు వేంకటేశ్వర స్వామివి.
సుమన్‌కు మాట పోయింది. నేనేమిటి? కరాటే నేర్చుకుని హాహూ అనే హీరో ఏమిటి? ఫైటింగులు చేసే హీరో ఏమిటి? కండలు తిరిగిన హీరో ఏమిటి? ఇప్పుడు వేంకటేశ్వరస్వామి వేషం ఏమిటి?
‘స్వామికి నీ మీద దయ కలిగిందయ్యా. అందుకే నా మనసులో నువ్వు మెదిలావు’ అన్నారు రాఘవేంద్రరావు.
ఈ చాన్స్‌ను వదిలేసి ఉంటే ఇవాళ సుమన్ రీచార్జ్ లేదు.
సుమన్ మొదట భక్తిగా తిరుపతి వైపు తిరిగి దండం పెట్టుకున్నాడు.
ఆ తర్వాత రాఘవేంద్రరావుతో ఎస్ చెప్పాడు.

******

అన్నమయ్య ఫ్లాప్. ఇదీ రెండోరోజు ఇండస్ట్రీలో వినిపించిన టాక్. సుమన్ గుండె ఢాం అంది. ఎంతో కష్టపడి చేశాడీ పాత్రని. కెరీర్‌ని పణంగా పెట్టి చేశాడు. ఉదయం 9 గంటలకు షాట్ అంటే తెల్లవారు ఝాము మూడున్నరకు మెలకువ. ఐదు గంటలకు మేకప్. ఎనిమిదిన్నరకు సెట్లో రెడీ. నో నాన్‌వెజ్. నో ఫ్యామిలీ లైఫ్. షూటింగ్ జరిగినన్నాళ్లూ కటిక నేల మీద నిద్ర. దాదాపు 8 నెలలపాటు ఆ పాత్రను ఓ తపస్సులా చేశాడు. కాని సినిమా పోయిందని టాక్. వేంకటేశా... అలా చేయకు. నా కోసమైనా చేయకు అని మొక్కుకున్నాడు సుమన్. రెండో వారం నుంచి మిరకిల్. అన్నమయ్యకు మొక్కులు. ప్రతి హాల్ ఒక మినీ తిరుపతి. తండోప తండాలుగా జనం. హాళ్ల దగ్గరే తలనీలాలు.
ఎన్టీఆర్ దేవుడే.
సుమన్ కూడా ఇప్పుడు దేవుడు.
ఆ వరుస అలా కొనసాగింది. రామదాసులో రాముడి వేషం. ఆపైన సత్యనారాయణ స్వామి.
చెరసాల సుమన్‌లోని ఏదో ఆత్మిక దీపాన్ని వెలిగించింది.
లేకుంటే ఇన్ని పాత్రలు వెతుక్కుంటూ రావు.
సరే. ఓకే. మళ్లీ రొటీన్. అంతేనా.
కాలమా కాలమా? సుమన్ కోసం ఇంకా ఏం దాచావ్?

******

 ‘నా దారి రహదారి. బెటర్ కమ్ ఇన్‌మై వే’ అన్నారు రజనీకాంత్ ఒకరోజు సుమన్‌కు ఫోన్ చేసి.
తను శివాజీ. సుమన్ విలన్. డెరైక్టర్ శంకర్. ఏమి ఈ లీల!
తను ఇంతకాలం హీరో. ఇప్పుడు గౌరవ ప్రదమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలాంటి టైములో విలన్‌గా చేయడం అంటే? ఆర్టిస్ట్‌గా ఇది తనకు ఛాలెంజ్. ఈ అవకాశాన్ని వద్దని అన్నా ఇవాళ మనకు ఈ రీచార్జ్ లేదు.
సుమన్ ‘ఎస్’ అన్నాడు. మీసం తీసేయాలి. అంటే ‘ఎస్’ అన్నాడు. వేరే తమిళ సినిమాలు ఒప్పుకోకూడదు. సుమన్ ‘ఎస్’ అన్నాడు. నో మేకప్. సుమన్ ‘ఎస్’ అన్నాడు. ఎత్తు పళ్లు అంటే ‘ఎస్’ అన్నాడు.
ఫస్ట్ డే షూటింగ్‌కు వచ్చి షాట్ ఇస్తే రజనీ డంగైపోయాడు.
సుమన్‌ను పక్కకు పిలిచి చెప్పాడు- సుమన్ ఈ సినిమాలో నేను రజనీ. రెగ్యులర్ రజనీ. కొత్తగా వచ్చే పేరు లేదు. పోయే పేరూ లేదు. రాబోయే పేరంతా నీదేనయ్యా.
రజనీ అన్నట్టే జరిగింది.
శివాజీ కోటిరెట్ల హిట్. సుమన్‌కి శతకోటి రెట్ల పేరు.

******

సుమన్ ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్.
కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో బిజీ.
ఎలా సాధ్యం ఇది?
జీవితంలో ఇంత దెబ్బ తిని తట్టుకొని మళ్లీ నిలవడం ఎలా సాధ్యం?
ఇలా రీచార్జ్ కావడం ఎలా సాధ్యం.
ఉద్యోగం పోతే, బాస్ తిడితే, ఎవరో సూటిపోటి మాటలంటే, కారుకు చిన్న యాక్సిడెంట్ అయితే, పిల్లలకు జ్వరం వస్తే, భర్త కోప్పడితే, భార్య అలిగితే... ఐపోయింది అంతా అయిపోయిందని డిప్రెషన్‌కు వెళ్లిపోయే ఈ కాలంలో సుమన్ ప్రస్తావనే ఒక రీచార్జ్.

******

ఓపికగా ఉండండి.
చెడు జరిగిదంటే...
మంచి జరగబోతోందని అర్థం.
డిశ్చార్జ్ అయ్యారంటే
రీచార్జ్ కాబోతున్నారని అర్థం.

సుమన్ తరంగిణి
పుట్టింది : 1959 ఆగస్టు 28
పూర్తి పేరు : మంగళూర్ సుమన్ తల్వార్
తల్లిదండ్రులు : కేసరీ చందర్, సుశీల్ చందర్
చదివింది : బి.ఎ. (ఇంగ్లీష్ లిటరేచర్)
భార్య : శిరీష
సంతానం : కూతురు అఖిలజ ప్రత్యూష
మాతృభాష : తుళు (మంగళూరు, కర్ణాటక)

తొలి చిత్రం : నిచ్చల్ కులమ్ (1977-తమిళం) ఇద్దరు కిలాడీలు (హీరోగా ఫస్ట్) తరంగిణి (1982) (రిలీజ్ ఫస్ట్)
గంగోత్రి (కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫస్ట్)శివాజీ (విలన్‌గా ఫస్ట్)
ఏ ఏ భాషల్లో : తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీ, ఇంగ్లీషు
నచ్చిన తారలు : శివాజీ గణేశన్, ఎమ్జీఆర్, శ్రీదేవి, రంజినీకాంత్, కమల్‌హాసన్

అలా నేర్చుకున్నారు
సుమన్ తెలుగు ఫీల్డ్‌కి రావడానికి కారకుడు భానుచందర్. ‘నల్లదే నడంది తీరుం’ అనే తమిళ సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సుమన్‌ని ‘‘నువ్వు తెలుగులో క్లిక్ అవుతావ్’’ అని బలవంత పెట్టి మరీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌కి పరిచయం చేశారు భానుచందర్. అలా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ‘ఇద్దరు కిలాడీలు’ మొదలైంది. అందులో సుమన్, భానుచందర్ ఇద్దరూ హీరోలే. అప్పటికి సుమన్‌కి ఒక్కముక్క తెలుగు తెలియదు. ఫస్ట్ డే షూటింగ్. అసిస్టెంట్ డెరైక్టర్ డైలాగ్స్ వినిపిస్తుంటే, సుమన్‌కి వెన్నులో వణుకు మొదలైంది. ‘అమ్మో! ఇదేదో తనవల్ల అయ్యేట్టు లేదు’ అనుకున్నాడు. లంచ్‌బ్రేక్ ఇవ్వగానే చెప్పాపెట్టకుండా ఇంటికి వెళ్లిపోయి తలుపులు బిడాయించి కూర్చున్నాడు. రెండయింది... మూడయింది. సుమన్ జాడలేకపోవడంతో భరద్వాజ్‌లో ఒకటే టెన్షన్. సుమన్ ఇంట్లో ఉన్నాడని తెలిసి వెళ్లారు. ‘‘తెలుగు నావల్ల కాదు బాబోయ్. మీరు వేరే హీరోని పెట్టుకోండి’’ అని చెప్పేశాడు సుమన్. ఈ విషయం భానుచందర్‌కు తెలిసింది. తను వెంటనే పరుగెత్తుకొచ్చాడు. సుమన్‌ని బుజ్జగించి ‘‘తెలుగు నేర్చుకోవడం చాలా ఈజీ... కొన్నాళ్లు కష్టపడు. ఆ తర్వాత నువ్వు తెలుగు ఫీల్డ్‌ని వదలమన్నా వదలవు’’ అనడంతో సుమన్‌లో కసి పెరిగింది. ఆ సినిమా పూర్తయ్యే నాటికి తెలుగు నేర్చుకోగలిగాడు.

అతిరథ మహారథులు మెచ్చిన నటన
కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన సుమన్ తెలుగింటి అల్లుడు. ప్రఖ్యాత రచయిత డీవీ నరసరాజు మనవరాలైన శిరీషను పెళ్లాడారు. వీరికి ఒక అమ్మాయి. పేరు అఖిలజ ప్రత్యూష. ఇంటర్ చదువుతోంది.

‘అన్నమయ్య’లో వేంకటేశ్వర స్వామి పాత్ర పోషణతో సుమన్ లైఫ్ మారిపోయింది. లెక్కలేనన్ని ప్రశంసలు... అవార్డులు. నాటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ, సుమన్‌ను పక్కన కూర్చోబెట్టుకుని రాష్ట్రపతి భవన్‌లో ‘అన్నమయ్య’ను తిలకించారు. నాటి సీబీఐ డెరైక్టర్ కార్తికేయన్, ఆర్మీ చీఫ్, నావీ చీఫ్ కూడా ఈ షో చూశారు.

సుమన్ తల్లి కేసరీ చందర్ మద్రాసు యతిరాజా కాలేజ్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. తండ్రి సుశీల్ చందర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేశారు. వీరికి సుమన్ ఒక్కడే సంతానం. సుమన్ తాతగారిది ఉడిపిలో వ్యవసాయ కుటుంబం. ఇప్పటికీ సుమన్ విజయదశమికి స్వస్థలం వెళ్లి తమ కులదేవత ఆశీస్సులు అందుకుంటారు.

బుల్లితెరపై చేయడానికి హీరోలు జంకుతున్న సమయంలో సుమన్ తొలుత ‘దాంపత్యం’ టీవీ సీరియల్‌లో రాజా పాత్ర పోషించారు. తర్వాత ‘భక్తరామదాసు’లో శ్రీరామునిగా కనిపించారు. తమిళంలో కూడా సీరియల్స్ చేశారు.

షూటింగ్ లేకపోతే సుమన్ ఇంట్లో గడపడానికే ఇష్టపడతారు. సినిమా ఫంక్షన్లకి వెళ్లే అలవాటు పెద్దగా లేదు. పబ్‌లు, బార్‌లకు సుమన్ ఆమడ దూరం.

‘బావా బావమరిది’తో ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్న సుమన్‌కి ఎప్పటికైనా జాతీయ అవార్డు సాధించాలనేది లక్ష్యం.

2001లో అఖిలజ ఫిల్మీ కార్పొరేషన్ సంస్థ ఏర్పాటు చేసి స్వీయదర్శకత్వంలో సినిమా నిర్మించాలనుకున్నారు. అలాగే ఆ సంస్థలో ఏడాదికి మూడు చిత్రాలు చేయాలని ప్లాన్ చేశారు. సరిగ్గా అదే సమయంలో తల్లి చనిపోవడంతో ఆ ఆలోచనకు పుల్‌స్టాప్ పెట్టేశారు.

సుమన్ ‘డెత్ అండ్ టాక్సిస్’ అనే హాలీవుడ్ చిత్రంలో హీరోగా నటించారు. ఆ సినిమాలో ఆయన ఆమెరికాలో స్థిరపడిన స్పానిష్‌గా కనిపిస్తారు.

రజనీకాంత్, కమల్‌హాసన్ అంటే సుమన్‌కి చాలా ఇష్టం. ‘శివాజీ’ షూటింగ్‌లో రజనీతో గడిపిన క్షణాలను ఎప్పటికీ మరిచిపోనని, తనకు ఆయన మోడ్రన్ గురువని చెబుతారు. తనకేదైనా సమస్య వస్తే సలహా కోసం రజనీకి ఫోన్ చేస్తారట.

ఎంజీఆర్, శివాజీ గణేశన్‌తో సినిమాలు తీసిన దర్శక నిర్మాత టీఆర్ రామన్న ‘నిచ్చల్‌కులమ్’ (1979) అనే తమిళ సినిమా ద్వారా సుమన్‌ని హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమాకు సుమన్‌కు అందుకున్న పారితోషికం రూ. 500.

Source: Sakshi news paper

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి