13, సెప్టెంబర్ 2011, మంగళవారం

సినిమా సృష్టి

మాహార కళ సమష్టి సృష్టి
మొన్న, నిన్న, ఇవ్వాళ, రేపు, గత ఆదివారపు సాయంత్రం, ఎల్లుండి మధ్యాహ్నం... సినిమా గురించి మాట్లాడుకోని సమయమంటూ మనకు ఉంటుందా? అలాంటి టాపిక్ లేకుండా ముచ్చట దొర్లిపోయే సందర్భం భవిష్యత్‌లోనైనా వస్తుందా? రాదని చెప్పడం కష్టం. సినిమా మన జీవితంలో భాగం.

అది మనకెప్పుడూ టాపిక్కే. అయితే, తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదకు 80 ఏళ్లు పూర్తవడం సినిమా ప్రస్థానాన్ని గురించి మాట్లాడుకోవడానికి మరింత మంచి సందర్భం. సుప్రసిద్ధ విమర్శకులు వి.ఎ.కె.రంగారావు అంతూదరీలేని సినీ సముద్రాన్ని ఈదే ప్రయత్నం చేస్తున్నారు.

మల్లాది రామకృష్ణశాస్త్రిగారే నా సినిమా రంగ ప్రవేశానికి పరోక్షంగా కారకులు. విశాఖపట్టణంలో ‘చివరికి మిగిలేది’ (1960) చూసి, ఆ పాటలు రికార్డులకు యివ్వలేదని తెలుసుకుని, మద్రాసు వచ్చి, గుమ్మడి గారి ద్వారా దర్శకుడు రామినీడుని కలిసి, ఆరు పాటలు రికార్డులకిప్పించడం ద్వారా పరిశ్రమ పరిచయమైంది నాకు.

రామినీడు, హేమాంబరధరరావు, ప్రత్యగాత్మ సోదరుల ప్రోత్సాహంతో ప్రెస్ రిలేషన్స్ ఆఫీసరుగా వారి చిత్రాలకు పని చేయడం ప్రారంభించాను. తదుపరి ఒక యిరవై ప్రముఖ సంస్థలకు, దర్శక, నిర్మాతలకు ‘పిక్‌న్యూస్’ ద్వారా తయారవుతున్న వారి సినిమాల గురించి వార్తలు, ఫొటోలు నెలకు మూడుసార్లు సైక్లోస్టైల్ (ఆ రోజుల జిరాక్సు) చేసిన అయిదారు పేజీలు పంపడం నా పని.

రివ్యూలిలా కూడా ఉండవచ్చా?

‘కలిమిలేములు’ (62), ‘తండ్రులు కొడుకులు’ (61) చిత్రాలతో పని చేయడం ప్రారంభించినప్పుడు నా వయసు 23. అప్పటికీ సినిమా అంటే ఒక అవగాహన ఉంది, స్వల్పమైనా. దీనికి కారణం తెలుగు, హిందీ, తమిళ, ఆంగ్లభాషల్లో సినిమాలు- అరు దుగా వంగ, గుజరాతీ, మరాఠీల్లో కూడా- చూడటమే కాదు, సినిమా పత్రిక పఠనం కూడా.

హిందీ చిత్రాల గురించి ఫిల్మిం డియా, ఆంగ్ల చిత్రాల గురించి అమెరికా పత్రికలు ఫొటోప్లే, మోషన్ పిక్చర్, స్క్రీన్ స్టోరీస్, తారల ఫొటోలు వేయడమే కాకుండా తగుపాటి లోతు గల విమర్శ, సాంకేతిక విభాగాల గురించి వ్యాసాలూ ప్రచురించేవి. పరిశ్రమలోని వ్యక్తుల గురించి గుసగుసలూ ఉండేవి. తెలుగులో రూపవాణి, తెలుగు సినిమా పత్రికలలో ఎక్కువగానూ చిత్రాంగి, వినోదిని, ఢంకాలలో తక్కువగాను సినిమా వార్తలు, రివ్యూలు వచ్చేవి.

చాలామట్టుకు ఆషామాషీ కబుర్లే. నా తొమ్మిదవ యేట బెంగళూరు బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్ హాస్టల్లో ఉండగా నాకు తెలుగు చెప్పే ఫాదర్ లాజరస్ వద్ద కృష్ణాపత్రిక మొదటిమారుగా చూశాను. ‘గుణసుందరి కథ’ (49) గురించి కొంచెం లోతుగా, కాస్త ఎద్దేవాగా సాగిన రివ్యూ చదివి, ‘ఓహో, రివ్యూలిలా కూడా ఉండవ’చ్చని గ్రహించాను. సంపాదకులు రాసే రివ్యూలలోనే ఫొటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ బాగాలేదు అన్న ఊకదంపుడు ఉండేది. చక్కని ప్రకృతినీ, అందమైన సూర్యోదయాస్తమయాలను చూపిస్తే మంచి ఫొటోగ్రఫీ అనీ, సినిమా విసిగిస్తే ఎడిటింగ్ లోటనీ వారి ఉద్దేశం.

పడుగు పేకల కళ

సినిమా ఒక సమాహార కళ. అందులో సాహిత్య సంగీతాలే కాదు, నటన, నృత్యమే కాదు, సాంకేతిక విభాగాలైన ఛాయాగ్రహణం, కూర్పు, కళాదర్శకత్వం, శబ్దగ్రహణం, భాగాలు. వీటన్నిటికీ సరైన స్థానం కల్పించేవాడు దర్శకుడు. ఈ పనులు నిర్వర్తించడానికంటూ వేర్వేరు నిపుణులను ఎన్నుకొన్న నిర్మాత దక్షతా గణనీయమే.

వీరందరి సమష్టికృషి చిత్రమంతటా పడుగుపేకల్లా అల్లుకొని ఉంటుంది. తెరపై ‘రసికరాజ తగువారము కామా’ కన్నులకు పండుగ మనసుకు ఆహ్లాదమూ కలగజేసిందంటే దానికి కారణం ఆ నటుని హావభావాలు, ధరించిన దుస్తులు, మేకప్, సెట్టు, దీనిని అలంకరించిన విధమూ, ఛాయాగ్రహణం (లైటింగ్ యిందులో ఒక భాగం), వేర్వేరు షాట్లను కూర్చిన తీరు, ఆ పాట రచన, సంగీత రూపమూ (వాద్యగోష్ఠితో సహా), గాయక సామర్థ్యమూ, ఆ దృశ్యంలో కనబడే తదితర పాత్రలు, వేషాలు, యీ సన్నివేశం కథాక్రమంలో పొందుపరచిన చోటూ, తీరూ, యివన్నీను.

వీటిలో ఒకటో రెండో కాస్త బలహీనమైనా కొట్టుకుపోవచ్చునేమో గాని సగానికి సగం సరిదూగకపోతే ఆ సన్నివేశం రాణించదు. ఎన్నో చిత్రాలు గొప్ప గొప్ప సెట్లు (రాజా మలయసింహ, 59), గొప్ప నటన (కలిమిలేములు 62), మేలైన సంగీతం (ఉయ్యాల జంపాల, 65), వాస్తవిక చిత్రణ (నిరుపేదలు, 54), భారీ తారాగణం (ప్రపంచం, 53), చక్కటి రచన (గోరంతదీపం, 78), నయనానందకరమైన నృత్యాలూ (పంతాలు పట్టింపులు, 68) చూపించీ ప్రజాభిమానం పొందలేదంటే దానికి కారణం ఒకటే; తక్కిన హంగుల సంకలనం సరిగా లేకపోవటమే.

‘రాక్షస’ సంగీతం అప్పుడే ఉంది!

పైన పేర్కొన్న సాంకేతిక విభాగాలన్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నా, వాటిని నిరూపించే విధానాలు మారుతూ వచ్చాయి. ఈ మార్పులు మొమ్మొదట చోటు చేసికొంటున్నప్పుడు కొంత అతలాకుతలాలు పడక తప్పదు. అలా లోటు కనబడినప్పుడు ఆ పద్ధతిని తప్పుబట్టడం అవివేకం. మార్పు సహజం. ఆ మార్పును నేర్పుతో నిర్వహించే పరిపక్వత సాంకేతిజ్ఞులకూ, దానిని అందుకోవలసిన విధంగా అందుకొనే సామర్థ్యం ప్రేక్షకులకూ అలవడటానికి కొంతకాలం పడుతుంది.

కొన్ని ఉదాహరణలు. ఇళయరాజా కొత్తగా పైకి వస్తున్నప్పుడు (రెహమాన్ నిచ్చెన ఎక్కుతున్నప్పుడు కూడా) చాలామంది నడివయస్సు శ్రోతలు ‘వెస్టర్న్ సంగీతంతో వీళ్లు మా ప్రాణాలు తీస్తున్నారండీ’ అని వాపోయేవారు. మన సంగీతంలోకి పాశ్చాత్య ధోరణులు తెచ్చింది వీరు కాదు. కర్ణాటక సంగీతానికి ప్రముఖ ముఖమైన త్యాగరాజు; దీక్షితర్ అయితే బ్యాండు మేళాలు వాయించే వరసలకు తెలుగు సంస్కృతాలలో దేవతాస్తుతులు రాశారు.

ఇక నాటకాలలో, మొదట టాకీలలో రాక్షస రాజులు, క్రూరులూ పేట్రేగినప్పుడు పాశ్చాత్య సంగీతం నేపథ్యంలో మార్మోగింది. దాదాపు 70 యేళ్ల కిందట ‘కోయెలొకసారి కూసిపోయింది’ (ఇల్లాలు, 40, ఎస్.రాజేశ్వరరావు) అన్న పాట పాశ్చాత్య పంథాలో వినిపించింది. ఇది విన్న ప్రేక్షకులు ఏమనుకున్నారో దాఖలాలు లేవు. ఒకటి మాత్రం నిజం; ఏమిటి ఉపయోగించారని కాదు ప్రశ్న, ఎలా ఉపయోగించారని.

మొదటి ‘మాయాబజారు’ (36)లోనే ‘వివాహ భోజన’మ్మనే పాటకు అప్రాచ్య సంగీతం పెట్టారు. ఆ వరస హరికథలకూ ఉపయోగపడింది. విజయావారిది (57) విజయాన్ని వినోదాన్ని కలిపి కొట్టింది. దాని గురించి ఏ ఒక్కరైనా అది ఆంగ్ల ధోరణిలో ఉంది కాబట్టి పనికి రాదు అన్నారా?

‘లో కీ’ లైటింగ్
మొదటి ‘హరిశ్చంద్ర’(35) లో ‘లో కీ’ లైటింగ్ ఉపయోగించారు. ఇప్పుడు చూసినా ప్రతిభావంతమైన ప్రయోగంగా కనబడుతుంది. ముఖాలు సరిగ్గా కనబడని ఫొటోగ్రఫీ అని ఆనాడన్నారేమో తెలియదు.

ఇటువంటిది పౌరాణికాలలో వాడటం అరుదే. అక్కడక్కడ ‘గంగా గౌరీ సంవాదం’ (58) లో వి ఎన్ రెడ్డి (ఛాయా గ్రాహకుడు, దర్శకుడు) చూపించాడు. ప్రేక్షకులకు నచ్చలేదు. అంతకు ముందే డాక్టర్ రాజారావు ‘పుట్టిల్లు’ (53)లో, ఇటాలియన్ నియో రియలిస్టిక్ చిత్రాలతో, ‘దో బిఘా జమీన్’(53) తో ప్రభావితమైన ‘నిరుపేదలు’(54) లో అలాంటి ఛాయాగ్రహణం ఉంది. ప్రేక్షకులు మెచ్చలేదు.

కసరత్తులా? నృత్యాలా?
ఒక సినిమాకు పలువురు నృత్యదర్శకత్వం నెరపడం ‘పెళ్లి సందడి’ (59)తో మొదలయ్యింది. టైటిల్స్‌లో ఫలానా పాటకు ఫలానా నృత్యదర్శకుడని వేయడం కూడా నిర్మాత సీతారాం ప్రారంభించిన మంచి అలవాటే.

‘ఈ రోజుల్లో అంతా కసరత్తులే గాని క్లాసికల్ డాన్సులేవీ?’ అవి గింజుకునే వారు గమనించవలసిన విషయం ఒకటుంది. శాస్త్రీయ నృత్యాలే గొప్పవి, తక్కినవి కావు అనే మాట తర్కానికి నిలవనిది. పసుమర్తి -భానుమతి కలయికలో వచ్చిన ‘పిలిచిన బిగువటరా’ నాట్యంగా చూసినా, ఆమె చేసినది విలువ కట్టినా గిల్టు నగ. వారిదే ‘రారా నా స్వామి రారా’ (విప్రనారాయణ 54) అపరంజి ఆభరణం.

‘జెంటిల్మన్’ (95) లో ప్రభుదేవా సృష్టించిన ‘చికుబుకు రైలే’ ఒక అపూర్వ శిల్పం. భారతీయ నృత్యరీతులకు ఏ మాత్రం సంబంధం లేకుండా దిద్దిన యీ కళాఖండం మైకేల్ జాక్సన్ చేసిన ఒక నాట్యానికనుకరణ అనడం నిజం కాదు.

ఎల్.విజయలక్ష్మి సినిమా నాట్యాల కొక కొలమానం. ఆమె చేసిన నాట్యాలన్నీ ఒక యెత్తు; ‘బభ్రువాహన’ (64)లో ‘నిలు నిలుమా’ పాట చివర నాయకుని కౌగిలిలో పావురంలా ఒదిగిన సౌరు ఒక యెత్త్తు.

లవకుశలోనే బూతు ఉన్నది...
బూతు మొదటి నుంచి ఉన్నదే. ‘లవకుశ’ (34)లో రజకుడు తన భార్యను అడ్డమైన తిట్లూ పాటలో తిడతాడు. ద్వంద్వార్థాలకూ, ఒక విధంగా బూతుకు మూలం జానపద గీతాలు. కళా దర్శకుడు టి.వి.ఎస్.శర్మ రికార్డుగా యిచ్చిన రెండు హాస్యగీతాల్లో ‘నీ పిఱ్ఱమీద పిడుగుబడా’ అన్న మాట ‘ఏ రాజు వేసినాడో’ పాటలో ఉంది. అయితే ఆడవాళ్ల్లే ఉడుపులప్పుడు అటువంటివి పాడుకొంటే అలసట తెలియకుండా ఉండటానికే గాని మరోదానికి కాదు.

ఈ పని ఎందరో చేసినా శివరావుకే ఆ అపకీర్తి అంటుకొన్నది. ‘ఒకరిని నాన వేశాన్’ పాటలో (బాలరాజు) ‘ఒకరికి కాళ్లు’ యివ్వడమంటే కడియాలు తొడుక్కోవటం అని తెలిసినప్పుడు తమాషాగా ఉంటుంది. ‘శ్రీలక్ష్మమ్మ కథ’ (50) లో అలా కాదు. ‘రావే రావే’ పాటలో హాస్యం లేదు, బూతే.

సెన్సారు నిబంధనలొకటి చెబుతాయి. వినపడే మాటలకు ద్వంద్వార్థం ఉన్నా దృశ్యం ద్వారా మంచి అర్థాన్ని సూచిస్తే, దాన్ని కట్ చేయకూడదు. ఇలా కొన్ని పాటలు, సైకిలు తొక్కడం, రోట్లో దంచడం చూపించీ కత్తిరింపును తప్పించుకున్నాయి. ‘దిగుతోంది దిగుతోంది కత్తిలాంటి నీ చూపు మెత్తని నా మనసులోన’ అని భర్త రాసిన పాటను భార్య (సెన్సారు మెంబరు) సమాజ శ్రేయస్సు దృష్ట్యా కట్ చేయాలన్నారు. అభ్యంతరం ఆ మాటలకు కాదు. గాయకి మూలుగులకూ, నర్తకి జఘనమండల చలనానికీ అని.

సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది?
సత్యజిత్ రే ఒకసారి నాతో అన్నమాట. ‘ఎక్కడ పడితే అక్కడ పాట పెట్టేయడమెలా? వెనుక వినిపించే సంగీతానికి మూలం ఎక్కడ! ఫాంటసీ అంటే అదొక దారి’. వెంటనే నేనడిగాను ‘పథేర్ పాంచాలి’ (55)లో నీటి పురుగుల సీక్వెన్స్‌లో వెనుక వినబడిన సంగీత గోష్ఠి ఎక్కడి నుంచి వచ్చిందని. ఒకే క్షణం చిరాకు కనిపించింది. ‘బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చిత్ర వ్యాకరణంలో ఒక భాగం’ అన్నారు. అలాగే పాటలు కూడా అని నేనంటే నవ్వేసి ఊరుకున్నారు.

సినిమా అంతటా అలాంటి కవిసమయాలే. ఎడిటింగ్ నిజ జీవితంలో సాధ్యమా? లాంగ్ షాట్, క్లోజప్? ఫ్ల్లాష్‌బ్యాక్, ఫ్ల్లాష్ ఫార్వర్డ్ తలపోతలని సరిపెట్టుకోవచ్చు. స్లో, క్విక్ మోషన్?
ఈ చిత్రసమయాలు మొదట్లో ఎబ్బెట్టుగా ఉన్నా క్రమేపీ వాటికలవాటు పడిపోతారు ప్రేక్షకులు. నాయికా నాయకులు ఒక యుగళగీతమారంభించీ -భించకముందే అటు యాభైమంది మగాళ్లు ఇటు అందరే ఆడవాళ్లు ఎక్కడ నుంచి వస్తారో అని వెక్కిరించే వాళ్లు ఈనాడెవరైనా ఉన్నారా?
అంతమందిని ఎలా కొడతాడు?

‘పల్లెటూరి పిల్ల’ (50)లో నాయకుడు ఆరుగురు భటులను మట్టికరపిస్తే ఇదెలా సాధ్యమని ఆ రోజుల్లో అనుకోవడం నాకు గుర్తే. ఇప్పుడు ఇరవైమందినీ, వందమందినీ నాయకుడు పైకి ఎగురుతూ కొందరిని, నేలపై వాలుతూ కొందరిని, అటూ ఇటూ విసురుకుంటూ కొందరిని మట్టుపెట్టడం ఈలలు వేస్తూ చూడటం లేదూ? ‘మగధీర’ (2010)లో గాలిలో ఎగురుతున్న హెలికాప్టర్‌ని నేలపై నడుస్తున్న జీపు, పెకైగిరి ఢీ కొంటే అదొక విడ్డూరంగా, విఠలాచార్యంగా ఎవరికైనా అనిపించిందా?

మొదట్లో ఫైట్లు అంటే కత్తి యుద్ధాలు. తమిళ పరిశ్రమలో స్టంట్ సోము ప్రసిద్ధుడు, తెలుగులో సాంబశివరావు. అవి తరువాత బాహాబాహీగానూ, దొమ్మీలగానూ మారాయి. ఇప్పుడీ సన్నివేశాలలో కార్లు తిర గబడిపోయి ధ్వంసం కావడం, మేడలు కూలిపోవడం ఈనాటి సరంజామా. కంటికి కలిగించే ఆశ్చర్యంతో తర్కానికి తావివ్వకపోవడం వీటి గొప్పతనం.

సగటు చిత్రంలో అన్ని విధాల ‘అతి’కి కారణం- సెక్సు, వయొలెన్సు వాటిలో కొన్నే- డబ్బే ముఖ్యమనుకొనే వారి సృష్టే అని వారిని దుయ్యబడుతున్నాం. వారికి కళ అనవసరం. వారు తమ లాంటి అలగాజనం కోసమే సినిమాలు తయారు చేస్తారు. మరి వీటి ప్రదర్శనకు అనుమతించే సెన్సారు సభ్యుల మాటేమిటి!

ఫాల్కేకు వందనం
ఆఖరి మాటగా మొట్టమొదట చెప్పవలసింది చెబుతున్నాను. కోటాను కోట్ల జనాన్ని అలరించేదీ, లక్షలాది ప్రజలను పోషించేది ఈ మహా పరిశ్రమ. భారతదేశంలో దీని పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే (1870-1944). ‘రాజా హరిశ్చంద్ర’ (13)తో కథా చిత్రాలకు నాంది పలికిన మహాత్ముడు. చివరి చిత్రమొకటే టాకీ, ‘గంగావతరణ్’ (37). యానిమేషన్ అని మనం ఈరోజు రకరకాల గంతులు వేస్తున్నాం.

అలాంటిది (బర్త్ ఆఫ్ ఎ పీ ఫ్లాంట్) తొంభై ఎనిమిది సంవత్సరాల క్రిందటే తీశాడు. పౌరాణికాలు, డాక్యుమెంటరీలు (అందులో ఎలా సినిమా తీస్తారు అన్నదొకటి), న్యూస్ రీల్సు, అన్ని రకాలు తీయడమే కాక ముడిఫిల్ముకి కన్నాలు (స్ప్రాకెట్స్) పెట్టడం, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, టైటిల్స్ రాయడం, దుస్తులు-మేకప్పు, సెట్సు ఇవన్నీ అతనే చూసుకొన్నాడు, ప్రొడక్షన్ సహితం. భారతానికి కృష్ణుడంతటి వాడు చిత్రభారతానికి ఫాల్కే.
......................

తెలుగులో తొలి రంగుల చిత్రం ఆలీబాబా 40 దొంగలు

తెలుగులో పూర్తి రంగుల చిత్రాలు ‘ఆలీబాబా నలభై దొంగలు’ (కొంత డబ్బింగ్, 55), ‘లవకుశ’(65), ‘తేనెమనసులు’ (65). అంతకు ముందు నుంచే ఒక ఆటా పాటా రంగుల్లో చిత్రించడం ఉంది. ‘రైతుబిడ్డ’ (39) కోసం, డూఫే కలర్‌లో కొన్ని సూర్యకుమారి సన్నివేశాలు తీసిన దాఖలా ప్రకటనలలో ఉంది; థియేటర్లలో చూపిన దాఖలా - రివ్యూలలో - ఇంకా దొరకలేదు.

ఇక చేతితో రంగులు వేయించడం - నేనిలాంటి సన్నివేశం చూసిన మొదటి చిత్రం ‘మైరావణ’(40)లో కాంచనమాల- చంద్రసేన సన్నివేశం. చివరిది ‘అనార్కలి’ (55)లో ‘రాజశేఖరా’, ‘తాగి తూగేనని’ పాటలు. జయభేరి మోగించిన చిత్రాలు ‘హరిదాసు’ (తమిళం), ‘రత్తన్’ (హిందీ 45)లకు విడుదలయిన కొన్నేళ్లకు, పూర్తిగా చేతి రంగులు వేయించి, 1948 ప్రాంతంలో, మద్రాసులో ప్రదర్శించడం నేను చూశాను.

తెలుగులో సినిమాస్కోప్ ‘ఒకనారి వంద తుపాకులు’ (73) లో చివరి రీలు మాత్రం. ఈ పద్ధతికీ మనదేశంలో నాంది పలికింది, హిందీ చిత్రమే; గురుదత్ ‘కాగజ్ కె ఫూల్’ (59). తెలుగులో పూర్తిగా సినిమాస్కోప్‌లో, రంగుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ (74).

70 ఎంఎంలో మొదటి భారతీయ చిత్రం ‘అరౌండ్ ద వరల్డ్’ (67) హిందీలో. తెలుగులో ‘సింహాసనం’ (86). త్రీ-డిలో ‘కుట్టి చేతన’ మలయాళం నుంచి తెలుగులోకి డబ్ చేశారు.
.................

తొలి డబ్బింగ్ చిత్రం ఆహుతి

ఈరోజు తమిళ, ఆంగ్ల భాషల నుంచి విరివిగా ఎన్నో చిత్రాలు అనువదించబడుతున్నవి. మొదటి తెలుగు డబ్బింగ్ చిత్రం ‘ఆహుతి’ (శ్రీశ్రీ, 50, మాతృక హిందీ ‘నీరా ఔర్ నందా’ 46). తెలుగు నుంచి మొదట డబ్ చేసిన సినిమాలు ‘కీలుగుఱ్ఱం’ (49), పల్లెటూరి పిల్ల (50). అరవ పేర్లు ‘మాయా కుదిరై’ ‘గ్రామప్పెణ్’. ఆంగ్లంనుంచి తెనిగించబడిన మొదటిది ‘జురాసిక్ పార్కు’ (వెన్నెలకంటి).

ఇంతవరకు ఇలా తెలుగులోనికి మార్పిడి చెందినవి తమిళం, హిందీవి ఎక్కువ. మలయాళ, కన్నడ భాషల నుంచి తక్కువ. ఇదే కాలంలో తెలుగు పౌరాణికాలు విజయవంతంగా బెంగాలీకి, ‘దక్షయజ్ఞం’ (62), ‘నర్తన శాల (63), ‘పాండవ వనవాసం’ (65), ‘శకుంతల’ (66), ‘భక్త జయదేవ’ (61). ఒక మాదిరిగా హిందీకి ‘మాయాబజార్’ (57), ‘వీరాభిమన్యు’ (65), ‘భూకైలాస్’ (58), భేరీ మోతగా మరాఠీకి, ‘భక్త తుకారాం’ (73), ‘సతీ సక్కుబాయి’ (65) మారాయి.

తెలుగు నుంచి ఆంగ్లానికనువదించబడిన మొదటి చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ (71), ‘ద ట్రెషర్ హంట్’గా. రచన రాండార్ గై.

‘ప్రేమలేఖలు’ (53), ‘మనోహర’ (54) డబ్బింగ్ చిత్రాలు కావు. ట్రాక్ చేంజి చిత్రాలు. అంటే, షూటింగ్‌లో ఆ పాత్రధారులే తమిళ, తెలుగు, హిందీలలో మాట్లాడతారు. వారి ఉచ్ఛారణ తగినట్లు లేకపోతే, అవే మాటలు మరొకరి చేత చెప్పిస్తారు.

స్ట్రెయిట్ సినిమాలలోనూ డబ్బింగ్ భాగాలు ‘మూగమనసులు’ (63) నాడే ఉన్నవి. ఔట్‌డోర్‌లో తీసిన భాగాలన్నిటికీ ఆ నటీనటులే తిరిగి చెప్పుకొన్నారు. ఇప్పుడెందరో నటీనటుల పాటలకే కాదు మాటలకూ అరువు కంఠాలే ఆధారం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి