13, సెప్టెంబర్ 2011, మంగళవారం

గూడవల్లి రామబ్రహ్మం


సామాజిక చైతన్యం గూడవల్లి రామబ్రహ్మం

తలుద్దాం కృష్ణాజిల్లా నందమూరులో జన్మించిన గూడవల్లి రామబ్రహ్మం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు. అఖిలాంద్ర రైతు మహాసభకు అధ్యక్షుడుగా, కార్యదర్శిగా వ్యవహరించారు. రంగస్థలం మీద వున్న అభిమానంతో రంగస్థల రచయితలతో కళాకారులతో సన్నిహితంగా మెలిగేవారు. 'కమ్మ కుల చరిత్ర'ని రాయడానికి చాలా పరిశోధనలు చేసారు. సమదర్శి పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా చేశారు. ఎడిటర్‌ అయ్యారు. తర్వాత ప్రజామిత్ర పత్రిక సంపాదకుడుగా వ్యవహరిస్తూ, సినిమా రంగంపై కూడా దృష్టి నిలిపి తొలుత సినిమా పబ్లిసిటీలో సలహాలిస్తూ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గానూ వ్యవహరించారు. కృష్ణలీలలు, ద్రౌపదీ వస్త్రాపహరణము, కనకతార చిత్రాలకు ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా, 'బాలయోగిని' చిత్రానికి అసోసియేట్‌ డైరక్టర్‌గా పనిచేసారు.
పత్రికాసంపాదకుడుగా జమీందార్లతో వున్న పరిచయాలు, వారిలో కూడా సినీరంగంపై ఆసక్తి వుండడంతో చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్‌ చైర్మన్‌గా సారథి నిర్మాణ సంస్థ ఏర్పాటు కావడంలో కృషి చేసారు.
ఈ సంస్థ గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో నిర్మించిన 'మాలపిల్ల, రైతుబిడ్డ' సంచలనం సృష్టించాయి. ప్రభుత్వం, మిగతా జమీందార్ల వ్యవహారశైలి కారణంగా తన ఆలోచనా సరళి మార్చుకున్నారు. ఇందిరా రమణ పతాకాన కడప కోటిరెడ్డి నిర్మించిన చిత్రం 'ఇల్లాలు'ని డైరక్ట్‌ చేసారు. ఉమామహేశ్వరరావు, కాంచనమాల హీరో హీరోయిన్లు. కె.ఎస్‌. ప్రకాశరావు, లక్ష్మీరాజ్యంలతో 'అపవాదు' చిత్రాన్ని కస్తూరి సంస్థకోసం డైరక్ట్‌ చేసారు. సారథివారు నిర్మించిన 'పత్ని, మాయాలోకం' చిత్రాలను డైరక్ట్‌ చేసారు. శారదా నిర్మాణ సంస్థను నెలకొల్పి 'పల్నాటియుద్ధం' కొంతభాగం తీసి అస్వస్థులవడంతో ఎల్‌.వి.ప్ర సాద్‌ని మిగతా చిత్రానికి దర్శకత్వం వహించమని కోరారు. గూడవల్లి మరణానంతరం పల్నాటియుద్ధం విడుదల అయింది. సామాజిక సమస్యలను యధాతథంగా చూపి ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో, మహిళా సమస్యలను ఊటంకిస్తూ సినిమా రూపకల్పనలో మహిళా పక్షపాతిగానూ వ్యవహరించారు. గూడవల్లి రామబ్రహ్మం జయంతి జూన్‌ 24.

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEja03hb3DLEq15YYf25Dk3WSrVZGrVfJcNk4MnRUMK1FckEVWRcBmo-Y8euGhsQdk43WkTaeeGdsXl3YsZFRMBdoqXx4fPtufBmJsGY3RQu1T4kPws-2bCOmTf4QZMekTalKnl6Hc3T723U/s1600/goodavalli+ramabrahmam.jpeg

 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiKjUxz1dLBsDlF0RAgrkVofkUlSJd3P9KFJm-5uVrfJrcpfdIDTtQmcdSY8xGnsQfNwGW-aGeGEljQ5gcrMv8aKxgTUbvIdCeKzJ06mHxjEmzqIvwkT6lE1G9bxtvzT5PfEQ1-L2FuJPK7/s1600/goodavalli+ramabrahmam+1.jpeg

 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhM2OMKk6I4ZUrsBWqvQJ_BnqyYeeFnOzuedltxILPGU8U86CUvpXEfAJ0c2bYEWe90hWgbmv_I9JPzqSTkSbVqWQEN9Npy3Yzks7hQYiBN5sttblAMI-2u-HnqHS8dG6lQe-0vTjfwid8X/s1600/goodavalli+ramabrahmam+2.jpeg


అభ్యుదయ చిత్రాల దర్శకుడు గూడవల్లి

'కళకాసుకోసం కాదు, కళప్రజలకోసం, ప్రజల అభ్యుదయం కోసం అనే నినాదంతో ఎంతోమంది ప్రజాకళాకారులు తమలోని కళను సమాజాభివృద్ధి కోసం వెచ్చించి పాటు పడ్డారు. అలాగే అనేక లలిత కళల సమ్మేళమైన సినిమాను కూడా అభ్యుదయ వాహికగా చేసుకుని కృషి చేసిన వారున్నారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి అభ్యుదయ చిత్రాల దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం.
కృష్ణాజిల్లా నందమూరులో 1902లో గూడవల్లి రామబ్రహ్మం జన్మించారు. బందరు కళాశాల్లో ఇంటర్మీయట్‌ను పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. సాహిత్యం, నాటకరంగాలపై ఉత్సాహం చూపారు. సాహిత్యం, పత్రికల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలని మద్రాసు చేరుకున్నారు.
మొదట తాపీ ధర్మారావు సంపాదకత్వంలో రూపొందుతున్న ''సమదర్శిని'' పత్రికలో ఉపసంపాదకుడిగా చేరారు. తర్వాత సంపాదకులు అయ్యారు. సినిమాల మీద ఆసక్తి ఏర్పడి పి.వి.దాస్‌ నెలకొల్పిన వేల్‌స్టూడియో నిర్మించే సినిమాలకు పబ్లిసిటీ సలహాదారునిగా నియమితులయ్యారు. ఇదే బ్యానర్‌ రూపొందించిన కృష్ణలీలలు సినిమాకు ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. తర్వాత ద్రౌపదీవస్త్రాపహరణ సినిమాకు కూడా ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేశారు. సరస్వతి టాకీస్‌ బ్యానర్‌పై 1937లో కనకతార సినిమా ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ గానే కాకుండా, చిత్ర రచయిత సీనియర్‌ సముద్రాలకు రచనా విషయంలో కూడా సహాయకుడిగా వ్యవహరించారు. బి.ఎన్‌.రెడ్డి గూడవల్లి రామబ్రహ్మం అభిమాని, తర్వాత వారిమధ్య స్నేహంకూడా ఏర్పడింది. గూడవల్లిగారు తమ మిత్రుడైన చల్లపల్లి రాజా, యార్లగడ్డ శివరామప్రసాద్‌ మరికొందరి సహాయంతో 1937 సెప్టెంబర్‌ శ్రీసారథి ఫిలింస్‌ లిమిటెడ్‌ కంపెనీ స్థాపించారు. దీనికి చల్లపల్లి రాజా చైర్మన్‌. గూడవల్లి రామబ్రహ్మంగారు మేనేజింగ్‌ డైరెక్టర్‌. మరికొందరు డైరెక్టర్లుగా ఉన్నారు. తొలి ప్రయత్నంగా 'మాలపిల్ల' సినిమా నిర్మించారు. అస్పృశ్యత, కులపిచ్చి అంశాల మీదున్న నాటకాన్ని సినిమాగా తీయాలని భావించినా మనసు మార్చుకుని, చలం చేత కథ రాయించారు. ఇందులో రైతుకూలీ సమస్యలను చర్చించడమే కాకుండా కూలీలందరూ ఒకటి కావాలనే నినాదాన్ని కూడా ఇచ్చారు. బ్రాహ్మణ యువకుడు మాలపిల్ల(కాంచనమాల)ని వివాహం చేసుకోవడం ప్రధాన ఇతివృత్తం, 1938లో లక్ష రూపాయల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. సినిమాల ద్వారా కూడా సమాజంలో మంచి మార్పులు తీసుకురావచ్చనే ఆయన ఆకాంక్ష ఇంకా బలపడింది. తర్వాత జమీందారీ వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ వారి అరచాకత్వం వల్ల పేదరైతులు, కూలీలు ఏవిధంగా బాధలు పడుతున్నారో తెలిపే ఇతివృత్తంతో రైతుబిడ్డ చిత్రానికి డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమా రచయిత గోపీచంద్‌తో ఉత్తేజభరితమైన మాటలు రాయించారు. కిసాన్‌ మూమెంట్‌లో ముఖ్యపాత్ర పోషించే వెంకట్రామనాయుడు, తాపీధర్మారావుల చేత ఆలోచనాత్మకమైన పాటలు రాయించారు. ఈ రైతుబిడ్డ సినిమా విడుదలై, అప్పటి జమీందార్లకు నిద్రలేకుండా చేసింది. కొంతమంది సినిమాని నిషేధించాలని గవర్నమెంట్‌ని ఒత్తిడి చేశారు. వెంకటగిరి జమీందారు కొన్ని సినిమా ప్రింట్లను తగులబెట్టించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నిషేధానికి గురైన చిత్రంగా రైతుబిడ్డని చెప్పుకోవచ్చు. దీని తర్వాత రైతుబిడ్డ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇది మంచిపేరు తెచ్చుకునా వారికి ఆర్థికంగా నష్టపరిచింది. తదుపరి బయట నిర్మాతలకు తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న సినిమాలు తీశారు. ఇందిరా ప్రాడక్షన్‌ ''ఇల్లాలు'' కస్తూరి సంస్థకు అపవాదు సినిమాల్ని రూపొందించారు. పల్నాటి యుద్ధం ప్రారంభించి అదిపూర్తికాకుండానే 1946 అక్టోబరు 1న గూడవల్లి రామబ్రహ్మం గారు మృతి చెందారు. మిగిలిన ఈ సినిమాకు ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వం వహించగా 1947లో పల్నాటి యుద్ధం సినిమా రిలీజైంది. రచన, నిర్మాణం, దర్శకత్వం వంటి శాఖల్లో అభ్యుదయ మార్పులు తీసుకొచ్చిన ఘనత గూడవల్లి రామబ్రహ్మంగారు స్వంతం చేసుకున్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి