6, డిసెంబర్ 2011, మంగళవారం

వాన పాట

కామెడీగా చెప్తే...
సినిమాకూ వానకూ-
బీరుకూ బారుకూ ఉన్న బంధం..
కత్తెరకూ జుట్టుకూ ఉన్న సంబంధం!
కొంచెం ఆలోచిస్తే...
వానకూ సినిమాకూ-
మనిషికీ స్వార్థానికీ ఉన్న బంధం..
అడుగుకూ మట్టికీ ఉన్న సంబంధం!
ఇంకొంచెం డీప్‌గా చెప్తే...
సినిమాకూ వానకూ-
కళ్లకూ కన్నీటికి ఉన్న బంధం..
ప్రేమకూ హృదయానికీ ఉన్న సంబంధం!
అందుకే కదా ఒకప్పుడు ‘పాట’ మాత్రమే అయిన వాన
ఇప్పుడు ‘ఫైటింగ్’ నుంచి ‘ఎమోషన్’దాకా జలె్లై కురుస్తోంది.




సినిమా పేరు: వర్షం
హీరోహీరోయిన్లు: ప్రభాస్, త్రిష.
దర్శకుడు: శోభన్.

RAIN-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaక్లయిమాక్స్ ఫైట్... హీరో కడుపులో కత్తి పోటు ఉంటుందప్పటికే. మోసపూరితంగా కళ్లల్లో దుమ్ము చల్లి దొంగచాటుగా విలన్ కొట్టిన దెబ్బలకు హీరో పడిపోతాడు. కళ్లు తెరిచే వీలులేదు. కాని అతని కళ్లలో దుమ్ము కొట్టుకుపోతేనే విలన్‌ను గెలవగలడు హీరో. ప్రేక్షకులకు ఉత్కంఠ క్షణాలు! అందరి ఆశ, నమ్మకం ఒక్కటే...వర్షం పడుతుంది... హీరో కళ్లను కడిగేస్తుందని! అంతకుముందు ప్రేమకథంతా నడిపించింది వర్షమే కదా. ఇప్పుడా ప్రేమను గెలిపించేదీ వర్షమే అనుకున్నారు... కానీ అక్కడ వర్షం రాలేదు. తెలుగు సినిమా ట్రిక్ ప్లే చేశాడు దర్శకుడు. అఫ్‌కోర్స్ హీరోయే గెలిచాడు. కాని సగటు ప్రేక్షకుడు ఓడిపోయాడు(డిసప్పాయింట్ అయ్యాడనుకున్నా ఫరవాలేదు). ‘ఛ! ఆ సీన్‌లో వర్షం వస్తే ఎంత బాగుండు’ అనుకోని ప్రేక్షకులు లేరేమో!!

ఇంద్రధనస్సులో ఏడు రంగులున్నాయి. నటనలో నవరసాలున్నాయి. వాటిలో ఏ రసాన్ని పండించడానికైనా అతికినట్టు సరిపోయేది ఒక్క వానదృశ్యాలే. రొమాన్స్ నుంచి ఫైటింగ్ వరకు ఏదైనా సరే రెయి్ ఎఫెక్ట్ సీన్‌లో డెప్త్ పెంచుతుంది. ఇండియన్ సినిమా చరిత్రలో వాన పాత్ర ఏంటి అని అడిగితే ముందుగా చెప్పేది పాటల గురించి. కరెక్టుగా చెప్పలేం కాని 1955లో వచ్చిన ‘శ్రీ420’ చిత్రంలోని ‘ప్యార్ హువా.. ఇక్‌రార్ హువా’ పాటతో వానపాటలకు మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్తారు. భారతీయ సినిమాపై వానపాటల పరంపరలో అది చెరగని ముద్ర వేసింది. యాభై ఐదేళ్లు గడిచినా ఆ పాటను ఇంకా గుర్తు చేసుకోక తప్పడం లేదు. ఆ హిట్ తరవాత సినిమాకో వానపాట కామన్ అయిపోయింది. క్రేజీ కాంబినేషన్‌కు వానపాట పెట్టి కొత్త ప్రచారానికి తెరలేపిన సందర్భాలూ ఉన్నాయి.

కొన్నాళ్లపాటు ‘వాన’... పాటలకే పరిమితమైందని చెప్పవచ్చు. తెలుగు సినిమా తీసుకుంటే ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ లాంటి ఎన్నో పాటలున్నప్పటికీ క్రేజ్ పెంచింది మాత్రం ‘ఆకు చాటు పిందె తడిసె’ అని శ్రీదేవితో ఎన్టీరామారావు చేసిన తడి డాన్సులు, వెచ్చని పదాల పదనిసలు. ఆ మాటకొస్తే అప్పట్లో నరేష్, రాజేంద్రప్రసాద్‌తో సహా ప్రతి తెలుగు హీరో వానపాటలో నటించినవాళ్లే. అయితే అప్పుడు వాన మేజర్‌గా ఉపయోగపడింది పాటలకే. కాని ఇప్పుడు వాన తీరు మారింది. దాని పరిధీ పెరిగింది. ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా, కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నా, తెలుగు సినిమా కథ ‘హీరో ’ చుట్టే తిరుగుతున్నట్టు మన టాలీవుడ్‌లో వాన కూడా సిల్వర్ స్క్రీన్ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇప్పుడు అన్ని ఎమోషన్స్ నింపుకుని జోరు పెంచింది. అందుకే నేటి వాన పాట పలుచనైంది.

ఎక్కడ థిక్ అయ్యింది మరి?

hero-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
అలాగయితే మొదటగా గుర్తుచేసుకోవాల్సింది ఫైటింగ్! ఆ తర్వాత ఎమోషన్!! భావోద్వేగాల్లోని గాఢత పెంచేందుకు రెయిన్ ఎఫెక్ట్‌ను ఎక్కువగా వాడుతున్నారిప్పుడు. ఫైట్స్ విషయానికొస్తే చిరంజీవి నుంచి మహేష్‌బాబుదాకా అందరూ రెయిన్‌ఫైట్స్ చేసినవారే. అయితే రెయిన్ ఫైట్‌కు ట్రెండ్ సెట్టర్ అయింది మాత్రం నాగార్జున ‘శివ’ అనుకోవచ్చు. ఆ సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే రెయిన్‌ఫైట్ అంత ఈజీగా మరిచిపోలేరు అభిమానులు. చేతిలో చైన్, మాస్ లుక్‌తో కనిపించిన నాగార్జునను మరింత హీరోని చేసింది వర్షమే. తడిసిన బట్టలతో భుజంపై విలన్‌ను ఎత్తుకుని వర్షంలో నడుస్తున్న నాగార్జున హీరోలకే హీరోగా కనిపించాడు. ఇక ఆ తరవాత రెయిన్ ఫైట్స్ పెరిగిపోయాయి. హీరోయిజానికి ఒక ‘మార్క్’లా నిలిచాయి. హీరోలోని ‘బీభత్సమైన’ రసాన్ని బయటకు తీయాలంటే వానొస్తే సరిపోతుంది. టాలీవుడ్ హీరోకు ‘స్టార్‌డమ్’ వచ్చేస్తుంది. అందుకే కదా ‘దడ’ సినిమా ఎలా ఉన్నా నాగచైతన్య చేసిన రెయిన్ ఫైట్ మాస్‌కు తెగ నచ్చింది. ఒక్క నాగచైతన్యే కాదు దాదాపు యువ హీరోలందరూ వానపాటలు పాడినోళ్లు...వర్షంలో ఫైట్స్ చేసినోళ్లే! ప్రభాస్ (బుజ్జిగాడు), జూనియర్ ఎన్టీఆర్(అశోక్), మహేష్‌బాబు(ఒక్కడు), పవన్ కళ్యాణ్(జల్సా), అల్లు అర్జున్ (వరుడు)... ఇలా ఎవరి గురించి చెప్పినా వర్షంతో మంచి అనుబంధమే కనిపిస్తుంది.

డెప్త్ పెంచేందుకు....
ఉద్వేగభరిత సన్నివేశాల్లో వర్షం ప్రధాన పాత్ర. ముఖ్యంగా ప్రేమికులు విడిపోయినప్పుడు, ఇంటి ముందు నిలబడి పంతం నెగ్గించుకునే సన్నివేషాలు, హీరోహీరోయిన్ల నిరీక్షణలో టెన్షన్ సృష్టించేందుకు...ఇలా కొన్ని ప్రత్యేక దృశ్యాల్లో వాన జోరు ఎక్కువే కనిపిస్తుంది తెలుగు సినిమాల్లో. కొన్ని హిట్ సినిమాల్లో మొదటిసారి హీరోయిన్‌ను వర్షంలో చూస్తాడు హీరో(ఆడవారి మాటలకు అర్థాలే వేరులే). చిటపట చినుకుల శబ్దంతో పాటు ఆ తడి స్పర్శకు అతనిలోని ప్రేమికుడు ఒక్కసారిగా నిద్రలేస్తాడు. ‘ప్రేమ అనేది వ్యక్తీకరించలేని భావమని’ ఎవరన్నారు అనిపిస్తుంది వర్షంలో తొలిచూపు ప్రేమ సన్నివేశాలు చూసినప్పుడు. అదీ వాన గొప్పతనం! అయితే అదే ప్రేమికులు ఏదైనా కారణంతో విడిపోతున్నప్పుడు కూడా ఆ భావోద్వేగాలన్నీ వానతో ముడిపెడితేగానీ రక్తికట్టవు. ‘కన్నీటిని దాచడానికి వర్షం’లో నిలబడ్డ హీరో(మనసంతా నువ్వే)ను, జోరున కురుస్తున్న వానతో పాటు భోరున ఏడుస్తూ పరుగెత్తుతున్న హీరోయిన్ మధ్య వీడ్కోలు ప్రేమను చూసి ప్రేక్షకుడు కూడా ఆ చినుకుల ముసురుతో ఉద్వేగభరితుడవుతాడు.

ఇంట్రడక్షన్
ఇమేజ్ ఉంటే చాలు. వానను రప్పించవచ్చు. అందుకే కొందరు హీరో, హీరోయిన్లు ఇంట్రడక్షన్ సీన్‌లలో వానను పట్టుకొస్తారు. ఆ మధ్య రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘కథనాయకుడు’ సినిమాలో నయనతార వానలో చిందులేస్తూ కనిపిస్తుంది. వానలో అదరగొట్టిన ఇంట్రడక్షన్ ఫైట్స్ కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే హీరోయిజానికి వాన కూడా తోడవ్వాల్సి వస్తోంది.మనసుపై ప్రభావం చూపే ప్రకృతి దృశ్యాల్లో వాన కూడా ఒకటి. స్క్రీన్ మీద ఆర్టిఫిషియల్ వానే కురిసినా ఆ చినుకుల జల్లుకు ప్రేక్షకుల మనసు ఓలలాడక మానదు. వర్షపు సన్నివేషాలకు ప్రేక్షకుల దృష్టిని లాక్కునే శక్తి ఉంది కాబట్టే... లక్షలు వ్యయం చేసి కృత్రిమ వానలు సృష్టిస్తున్నారు. నిజానికి వాన దృశ్యాలు తీయడానికి వాటర్ ప్రూఫ్ మేకప్ నుంచి క్లారిటీ ఫోటోగ్రఫీ వరకు అన్నీ ప్రత్యేక పద్ధతులు అనుసరించాలి. నటీనటుల ఆరోగ్యం రీత్యా ఎక్కువ తినకుండా జాగ్రత్తపడాలి. నీటి సమస్య దృష్ట్యా తక్కువ నీటితో సీన్ కంప్లీట్ చేయగలగాలి. ఇన్ని సమస్యలున్నప్పుడు వాన దృశ్యాలు అవసరమా? అంటే.... అవసరమే! కష్టసుఖాలు కలిసిన హారం జీవితం! తడిపొడి దృశ్యాల సమాహారం సినిమా! అవి చక్కగా కుదిరినప్పుడే కదా ప్రేక్షకులు ఆనందంలో ‘తడిసి’పోతారు.
బి.మహేందర్

హాటెస్ట్ రెయిన్ సాంగ్స్
1. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు(ఘరానా మొగుడు)
2. ఆకు చాటు పిందె తడిసె(వేటగాడు)
3. వానా వానా వల్లప్పా (బంగారు బుల్లోడు)
4. స్వాతి చినుకు సందెవేళలో( ఆఖరిపోరాటం)
5. వానా వానా వెల్లువాయె(గ్యాంగ్ లీడర్)
6. వానా జల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా (యుముడికి మొగుడు)
7. రంగు రంగు వానా నంగనాచి వానా (బలాదూర్)
8. చీకటి పడితే (అగ్నిగుండం)
9. వానా వానా వందనం (అడవి దొంగ)
10. మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం( వర్షం)

హాటెస్ట్ బాలీవుడ్ రెయిన్ సాంగ్స్ ఫరెవర్
1. ఆజ్ రపత్ జాయే తో( నమక్ హలాల్-1982)
2. ఏక్ లడికీ భాగీ భాగీ సీ (చల్తీ కా నామ్ గాడీ- 1959)
3. రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ దేఖో (షెహ్‌జాదా- 1972)
4. కుచ్‌కుచ్ హోతా హై (కుచ్ కుచ్ హోతా హై-1998)
5. దిల్ తేరా దివానా (దిల్ తేరా దివానా- 1962)
6. భిగి భిగీ మై (ఆజ్‌నబీ-1974)
7. ఓ ఘటా సన్వారీ (అభినేత్రి- 1970)
8. హమ్ తుమ్ (హమ్ తుమ్- 2004)
9. ప్యార్‌హువా ఇక్‌రార్ హువా (శ్రీ420- 1955)
10. రిమ్‌జిమ్ కే తేరే (కాలా బజార్-1960)

పాత వానపాట- కొన్ని రూల్స్
అప్పటి వాన పాటలు మహా క్రేజ్. ఇప్పుడు ‘కాంబినేషన్’ను ఎంత పాపులర్ చేస్తున్నారో అప్పుడు వానపాటలను అంత ప్రచారం చేసేవాళ్లు. పాటల చిత్రీకరణ కూడా కొన్ని రూల్స్ ప్రకారం తీసినట్టు అనిపిస్తుంది. అప్పుడన్నీ రొమాన్స్ పాటలే అనుకోవచ్చు. హీరో హీరోయిన్లు ఇద్దరే ఉండేవారు. చీరకట్టు క్యాస్టూమ్స్. అదీ పలుచని తెల్లచీర. మ్యాగ్జిమమ్ డ్యాన్సు తగ్గించి ఎక్స్‌ప్రెషన్స్‌తోనే పాట నడిచేది. మహా అయితే చిన్న చిన్న కదలికలు! దాదాపు రొమాంటిక్ డ్యూయెట్సే ఎక్కువ. ప్రస్తుతం ట్రెండ్ మారింది కదా. అందుకేనేమో పాటలు పలుచన అవుతున్నాయి.

అప్పటి క్రేజ్ ఉందా?
అయితే ఇప్పటి వాన పాటలకు మునుపటిలా క్రేజ్ ఉండడం లేదనేది నిజం. కారణం ప్రస్తుతం విచ్చలవిడిగా నడుస్తున్న ‘ఎక్స్‌పోజింగ్’ ట్రెండ్. వానలో కూడా చాలీచాలనీ దుస్తులతో డ్యాన్సులు చేస్తున్న హీరోయిన్స్ గ్లామర్‌పై దృష్టిపెట్టమంటూ మూడు సెకన్లకోసారి గుర్తు చేస్తాడు కెమెరామాన్. వానను డామినేట్ చేసే గ్లామర్ షో అది. పైగా బ్రేక్‌లు, షేక్‌లు. అందుకేనేమో ఫీల్ తీసుకొచ్చే రెయిన్ పడుతున్నా కూల్‌గా లుక్‌ను మార్చుకునేలా చేస్తున్నాయి నేటి వానపాటలు. దాదాపు చాలా సినిమాల్లో వాన పాటలు ఉంటున్నాయి కాని మునుపటిలా రొమాంటిక్‌గా గుర్తుంచుకునేలా ఉండడం లేదు. మొన్నటి ‘ద్రోణ’ నుంచి రీసెంట్‌గా వచ్చిన ‘బద్రినాథ్’లో కూడా రెయిన్‌సాంగ్స్ ఉన్నాయి. అయితే తెలుగు సినిమాల్లో వానకూ పాటకూ ఉన్న బంధాన్ని సున్నితంగా స్పృశించలేకపోయాయి.

(02-09-2011 నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో..)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి