13, సెప్టెంబర్ 2011, మంగళవారం

తొలి తెలుగు టాకీకి 80 ఏళ్లు


సినిమా అంటే…
ఒక వెలుగు
ఒక మాయ
ఒక రంగులకల
ఒక ఉత్కృష్ట కళ
డబ్బును పుట్టించే మాయోపాయం
డబ్బును పోగొట్టే మహాజూదం
ఒక్క మాటలో సినిమా అంటే జీవితం!
వంద నిర్వచనాలు ఇవ్వడానికి కారణమైంది సినిమా. వందలాది ఆరాధ్యదేవతలను వెలుగులోకి తేవడానికి వేదికైంది. కోట్లాది మంది కళాతృష్ణను తీర్చే తీపి చెలమైంది. వినోద సాధనంగా మొదలై, ప్రాణవాయువైంది.
వీటన్నింటికీ బీజం వేసిన సినిమా ‘భక్త ప్రహ్లాద’.
తెలుగు తెరపై మాటలు నేర్చిన తొలి పసికందు ‘భక్త ప్రహ్లాద’. బొమ్మలు మాట్లాడిన క్షణం ప్రేక్షకుడి మాటలు పడిపోయాయి. తరువాత ఆ బొమ్మలతోనే మాటల్లో పడిపోయాడు. మైకంలో మునిగిపోయాడు.
ఒక చరిత్రకు పునాది వేసిన ‘భక్త ప్రహ్లాద’ చిత్రానికి 80 ఏళ్లు.
తొలి తెలుగు టాకీకి అశీతి మహోత్సవం.
ఐమాక్స్‌లో ‘అవతార్’ త్రీడీ చూసి, జేమ్స్ కేమరూన్‌కి జై కొడతాం! మల్టీప్లెక్స్‌లో ‘రోబో’ చూసి, శంకర్‌కి హ్యాట్సాఫ్ అంటాం!
మరి హెచ్.ఎం.రెడ్డికి ఏం చెప్పాలి?
ఎవరీ హెచ్.ఎం.రెడ్డి?
ఆయన గురించి తెలియాలంటే-
ముందు మన సినిమా పుట్టుక గురించి తెలియాలి. మూకీ నుంచి టాకీలోకి వచ్చిన సినిమా ప్రస్థానం తెలియాలి. ఒక్కమాటలో ‘భక్త ప్రహ్లాద’ గురించి తెలియాలి. దానికి మనం గతంలోకి క్లోజప్ చూడాలి!
బొమ్మ కదలడమేమిటి?
ఇప్పుడంటే-
రకరకాల డిజిటల్ కెమెరాలు… మోషన్ కాప్చరింగ్ టెక్నాలజీలు… ‘మాయ’ సాఫ్ట్‌వేర్లు… నెంబరాఫ్ విజువల్ ఎఫెక్టులు ఉన్నాయి.
అదే 80 ఏళ్ల క్రితమైతే ఏమీ లేవు. శూన్యం. ఈ శూన్యంలోంచే అద్భుతాన్ని సృష్టించాలి.
అప్పటి జనానికి వినోదమంటే నాటకం… తోలు బొమ్మలాట… ఇంకేదో!
అలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడో ఓ మూల సినిమా పుట్టింది. తెర… ఎదురుగా ప్రొజెక్టర్… ఆన్ చేస్తే తెర మీద కదిలే బొమ్మలు. జనానికది ఓ అద్భుతం. తెరమీద బొమ్మలు కదలడం ఏమిటని కొందరు భయపడ్డారు. ఇంకొందరు కీడు సంభవిస్తుందని కంగారుపడ్డారు.
మరికొందరు వెక్కిరించారు. అయినా సినిమా వెనక్కు తగ్గలేదు. పైగా మాటలు నేర్చింది. ఇది ఇంకో షాక్.
ఛీ కొట్టిన నోటితోనే జై కొట్టించుకుంది సినిమా. ప్రపంచమంతా సినిమా వైపు అట్రాక్ట్ కాసాగింది. మన దేశంలో మొదట స్పందించింది అర్దేషిర్ ఇరానీ. ‘షో బోట్’ అనే పాశ్చాత్య టాకీని చూసి మంత్రముగ్ధుడైపోయి ఫారిన్ నుంచి శబ్దగ్రహణ యంత్రాన్ని దిగుమతి చేసుకుని హిందీలో ‘ఆలం ఆరా’ తీశాడు. తొలి భారతీయ శబ్ద చిత్రం అదే.
1931 మార్చి 14… బొంబాయిలోని మెజిస్టిక్ థియేటర్‌లో తొలి ‘షో’ పడింది. సువిశాల భారత క్షేత్రంలో మాటల సినిమా మొగ్గ తొడిగింది.
తెలుగు చలనచిత్ర పితామహుడు
ఇక్కడ రఘుపతి వెంకయ్య నాయుడు గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయనో ఫొటో స్టూడియో ఓనర్. సినిమాకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉందని తొలుత గుర్తించిన సినీబ్రహ్మ. స్టూడియోను తాకట్టుపెట్టి విదేశం నుంచి సినీ ప్రదర్శన యంత్రం ‘క్రోనో మెగాఫోన్’ను తెప్పించారు. ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, శ్రీలంక, బర్మా, రంగూనుల్లో పర్యటించి డేరాలు వేసి సినిమాలు ప్రదర్శించారు.
మద్రాసులో ‘గెయిటీ’ పేరుతో తొలి పర్మినెంట్ థియేటర్ నిర్మించారు. 1913లో ‘గ్లాస్ స్టూడియో’ నెలకొల్పారు. తర్వాత సొంతంగా సినిమాలు నిర్మించాలనే ఉద్దేశంతో కొడుకు ఆర్.ఎస్. ప్రకాశ్‌ని లండన్‌లో శిక్షణకు పంపించారు. 1921లో ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్ ఫిలిమ్స్’ పతాకంపై ‘భీష్మ ప్రతిజ్ఞ’ అనే మూకీ తీశారు. తర్వాత ‘గజేంద్ర మోక్షం’, ‘నందనార్’, ‘మత్స్యావతారం’ వంటి మూకీలు తీశారు.
ఆ తర్వాత కథ టాకీలకు మారింది. అప్పుడే హెచ్.ఎం.రెడ్డి ఎంటరయ్యారు. ‘ఆలం ఆరా’కు ఇరానీ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరారు.
‘మూకీ’ దర్శకునిగా…
హెచ్.ఎం.రెడ్డి జాగీర్దార్ కాలేజీలో ఇంగ్లీషు బోధకులు. హైదరాబాద్‌లో ప్లేగువ్యాధి రావడంతో బొంబాయిలో ఉంటున్న బావమరిది దగ్గరకు వెళ్లారు.
బావమరిది హెచ్.వి.బాబు అక్కడ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తున్నాడు. బావమరిది గాలి బావగారివైపు కూడా మళ్లింది. ఇంకేముంది… హెచ్.ఎం.రెడ్డి కూడా సినిమా ఫీల్డ్‌లో చేరిపోయారు. 1927లో అక్కడి శారదా ఫిల్మ్ కంపెనీలో రిఫ్లె క్టర్ బాయ్‌గా పనికి కుదిరారు. చిన్నాచితకా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్‌ను అర్థం చేసుకోసాగారు. రెడ్డిలోని సృజనాత్మక ఉత్సాహం వల్ల చివరకు శారదా ఫిల్మ్ కంపెనీ అధినేత భోగీలాల్ దవే దృష్టిలో పడ్డారు.
ఆయన మూకీ సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. పృథ్వీరాజ్ కపూర్ ముఖ్య పాత్రధారిగా ‘ప్రిన్స్ విజయకుమార్’(1930), ‘ఎ వేజర్ ఇన్ లవ్’(1931) సినిమాలు డెరైక్ట్ చేశారు హెచ్.ఎం.రెడ్డి. భోగీలాల్ దవే జర్మనీ వెళ్తూ తన మిత్రుడు అర్దేషిర్ ఇరానీకి హెచ్.ఎం.రెడ్డిని పరిచయం చేశారు. అప్పుడు ఇరానీ ఆయనను ‘ఆలం ఆరా’కు అసిస్టెంట్‌గా తీసుకున్నారు.
‘సురభి’ తారలతో తెలుగు టాకీకి పునాది
‘ఆలం ఆరా’ ఘనవిజయం అర్దేషిర్ ఇరానీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. హిందీలో చేసినట్టుగానే ఇతర భారతీయ భాషల్లో కూడా టాకీ చేయాలని కంకణం కట్టుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో టాకీ తీసే పనిని హెచ్.ఎం.రెడ్డికి అప్పగించారు.
అప్పటి సమాజంలో పౌరాణిక నాటకాలంటే యమాక్రేజ్. అటు ప్రేక్షకులను సినిమా వైపు ఆకర్షితం చేసుకోవాలన్నా, ఇటు నాటకాల నటీనటులను సినిమాల్లోకి తెచ్చి రంగులు వేయించాలన్నా పాపులర్ నాటకాన్నే తెరకెక్కించాలి. అందుకే భక్త ప్రహ్లాదుని వైపు మొగ్గారు హెచ్.ఎం.రెడ్డి.
అయితే, అప్పటికి 19 భక్త ప్రహ్లాద నాటకాలు చలామణీలో ఉన్నాయి. ఆంధ్రనాటక పితామహులు ధర్మవరం రామకృష్ణాచార్యులు రాసిన ‘భక్త ప్రహ్లాద’ నాటకం జనాదరణ పొంది ఉంది. ఈ నాటకంతోనే తెలుగు టాకీకి శ్రీకారం చుట్టాలని హెచ్.ఎం.రెడ్డి నిర్ణయించుకున్నారు. సురభి నాటక సమాజం వారికి ఈ నాటకం కొట్టిన పిండి. వాళ్లని కలిసి ఈ నాటకాన్ని సినిమాగా మలుస్తానని చెబితే, హెచ్.ఎం.రెడ్డిని వాళ్లు పిచ్చోడిలా చూశారు. ‘‘మీకు మంచి డబ్బులిస్తాం… దారి ఖర్చులిస్తాం… చక్కటి వసతి సమకూరుస్తాం’’ అని వాళ్లను బతిమాలి ఎలాగోలా ఒప్పించారు. ఇందుకు హెచ్.ఎం.రెడ్డికి నటుడు సీఎస్సార్ ఆంజనేయులు హెల్ప్ చేశారు. ఎట్టకేలకు సురభి ట్రూపు మొత్తాన్నీ బొంబాయి తీసుకువెళ్లారు.
సంగీత దర్శకుడు హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి, ఛాయాగ్రాహకుడు గోవర్ధన్‌బాయ్ పటేల్, ఇతర సాంకేతిక నిపుణులు… అంతా రెడీ.
ఇంపీరియల్ స్టూడియోలో షూటింగ్.
బయటివాళ్లు ఎవర్నీ లోపలికి రానివ్వకూడదని, షూటింగ్ అంతా గోప్యంగా ఉండాలని ముందే స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చేశారు.
లీలావతి పాత్రధారి కమలాబాయిపై ఫస్ట్ షాట్ తీశారు. హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, మొద్దబ్బాయిగా ఎల్వీ ప్రసాద్, ప్రహ్లాదునిగా మాస్టర్ కృష్ణారావు, దేవేంద్రునిగా దొరస్వామి నాయుడు నటించారు. అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన చిత్రపు నరసింహారావు బ్రహ్మ, ఛండామార్కుల పాత్రలు పోషించారు.
హెచ్.ఎం.రెడ్డికి సహజత్వం అంటే ఇష్టం. అందుకే హిరణ్యకశిపుడు, అతని పట్టమహిషి లీలావతి పాత్రలు అసలు సిసలు బంగారు ఆభరణాలు ధరిస్తే బాగుంటుందని భావించారు. ఖర్చు ఎక్కువ అవుతుందని భాగస్వాములు భావించినా, హెచ్.ఎం.రెడ్డికి చెప్పే ధైర్యం చేయలేకపోయారు. కంసాలిని పిలిచి నగలు చేయమని పురమాయించారు రెడ్డి. సమయా నికి అతను సిద్ధం చేయకపోవడంతో వేరే కంసాలిని పిలిపించారు. అతను దాదాపు రెండు నెలలు టైం అడిగాడు. దాంతో లీలావతి పాత్రకు వడ్డాణమైనా చేయమన్నారు. అలా బంగారు వడ్డాణం, మిగిలినవి గిల్టు నగలతోనే షూటింగ్ కానిచ్చేశారు.
మూకీ వేరు. టాకీ వేరు. మూకీలైతే హావభావాలు వ్యక్తం చేసే సామర్థ్యం ఉంటే చాలు. అదే టాకీకొచ్చేసరికి రకరకాల భావోద్వేగాలకు తగ్గట్టుగా సంభాషణలు చెప్పే చాతుర్యం కావాలి. వీటన్నిటినీ జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ హెచ్.ఎం.రెడ్డి సినిమా పూర్తిచేయగలిగారు. రోజుకి దాదాపు 20 గంటలు షూటింగ్ చేసేవారు. నాలుగు గంటలు మాత్రమే విశ్రాంతి. ఏడుపు సన్నివేశాల కోసం గ్లిజరిన్ వాడడమనేది అప్పటికి లేదు. మూడ్ తెచ్చుకుని ఏడవాల్సిందే. వెక్కిళ్లతో ఏడవడం ఆ రోజుల్లో పరిపాటి.
21 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. 9,700 అడుగుల నిడివితో, 18,000 రూపాయల ఖర్చుతో తొలి తెలుగు టాకీ సిద్ధమైంది.
తొలి స్పందన
1931 సెప్టెంబర్ 15.
బొమ్మ పడింది. మాట్లాడే భక్త ప్రహ్లాదుణ్ని వీక్షించి ప్రేక్షకులు ఆహా ఓహో అన్నారు. అప్పట్లో రోజుకి రెండే రెండు షోలు. ఒకటి ఫస్ట్‌షో (సాయంత్రం 6 గంటలకు), రెండోది సెకెండ్ షో (రాత్రి 9 గంటలకు). శని, ఆదివారాల్లో మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు ఇంకో షో ప్రదర్శించేవారు. టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడేవారు. అప్పటికి క్యూ పద్ధతి లేదు. ఎవరి బలప్రదర్శన బట్టి వాళ్లకు టికెట్లు దొరికేవి. రెండో ప్రపంచయుద్ధం తర్వాతనే థియేటర్ల వద్ద క్యూ సిస్టమ్ మొదలైందని నాటి తరం ప్రేక్షకులు చెబుతుంటారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల్లోని చాలా ఏరియాల్లో ‘భక్తప్రహ్లాద’ను తెలుగువారు బాగా ఆదరించారు. సికింద్రాబాద్‌లో అయితే 10 నెలలు ఆడింది. పత్రికలైతే ఓ పక్క మెచ్చుకుంటూనే మొట్టికాయలు కూడా వేశాయి. 1932, మే ‘భారతి’ సంచికలో ‘వెర్రి వెంగళప్పల్లా మనం ఈ ప్రమాదకరమైన మార్పు (టాకీ)ని ఎందుకు ప్రోత్సహిస్తు న్నామో అర్థం కాకుండా ఉంది’ అని రాశారు. సినిమాలో నాణ్యత లేదని చాలా విమర్శలు వచ్చాయి. శబ్దంలో అప్ అండ్ డౌన్స్ బాగా ఉండేవట. ఒక్కోచోట ఉన్నట్టుండి లౌడ్‌గా శబ్దం వచ్చేదట. అలాగే బొమ్మ కూడా స్పష్టంగా ఉండేది కాదట. మసక మసగ్గా ఉండేదట.
ఒంటరి ప్రయాణం
ఆల్రెడీ తెలిసిన కథే అయ్యుండొచ్చు. బొమ్మ స్పష్టంగా లేకపోయుండొచ్చు. శబ్దాల్లో హెచ్చుతగ్గులుండి డైలాగులు, పాటలు, పద్యాలు సరిగ్గా వినబడకపోయుండొచ్చు. ఇవన్నీ కాదు మనం చూడాల్సింది. హెచ్.ఎం.రెడ్డి చేసిన గొప్ప యజ్ఞాన్ని, అతి గొప్ప ప్రయత్నాన్ని.
నున్నటి సిమెంట్ రోడ్డు మీద నూటయాభై కిలోమీటర్ల స్పీడుతో కారు నడపడం గొప్ప కాదు. అసలు దారే లేని చోట… గమ్యం తెలియని చోట… అవరోధాల ముళ్లకంపలు పేరుకుపోయిన చోట… ఒంటరిగా ప్రయాణం చేస్తూ కంపల్ని ఏరేస్తూ, గుంతల్ని పూడ్చేస్తూ, ఓ రహదారి ఏర్పరచడమంటే ఎంత గొప్ప విషయం!
హెచ్.ఎం.రెడ్డి చేసింది ఇదే!
ఇప్పుడు ఆ దారే అందరికీ రహదారి.
ఇన్ని కోట్ల టర్నోవర్… ఇన్ని వేల కార్మికుల జీవితాలు… ఇంత పేరు… ఇంత ప్రఖ్యాతి… ఇన్ని అద్భుతాలు…
వీటన్నిటికీ పునాది ‘భక్తప్రహ్లాద’.
ఇంతా చేసి మన తొలి తెలుగు టాకీ నెగెటివ్‌నైనా కాపాడుకోలేకపోయాం. మనవారికి మన మూలాలపై ఉండే (అ)శ్రద్ధ అలాంటిది. కనీసం ఆ సినిమా జ్ఞాపకాలనైనా సజీవంగా నిలుపుకుని పాజిటివ్ ఎనర్జీతో ఫ్యూచర్ ఫిల్మ్‌ని ప్రాసెస్ చేద్దాం.
జై భక్త ప్రహ్లాద! జయహో హెచ్.ఎం.రెడ్డి!!
భక్త ప్రహ్లాద
సినిమా విడుదలైన తేదీ: 15 సెప్టెంబర్ 1931
నిర్మాణ సంస్థ: భారత మూవీటోన్
(శ్రీకృష్ణా ఫిల్ము కంపెనీ)
నిర్మాణ వ్యయం: 18,000 రూపాయలు
నిర్మాణ సమయం: 21 రోజులు
సంగీతం: హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
సాహిత్యం: చందాల కేశవదాసు
ఛాయాగ్రహణం: గోవర్ధన్‌భాయ్ పటేల్
దర్శకుడు: హెచ్.ఎం.రెడ్డి
………………..
టాకీ సినిమాకు మార్గదర్శకుడు
1892లో బెంగళూరులో పుట్టిన హెచ్.ఎం.రెడ్డి పూర్తి పేరు హనుమంతప్ప మునియప్ప రెడ్డి. తొలి తమిళ టాకీ ‘కాళిదాసు’క్కూడా ఆయనే సృష్టికర్త. అతిరథమహారథులు అనదగ్గవారంతా హెచ్.ఎం.రెడ్డి వల్లనే వెలుగులోకి వచ్చారు. పులి మీసాలతో గంభీరంగా కనిపించే ఆయనంటే అందరికీ హడల్. సినిమా నిర్మాణం అనేది సమష్టి కృషి అని త్రికరణశుద్ధిగా నమ్మేవారు.
అందుకే కథాచర్చల్లో చిన్నాపెద్దా అందరూ పాల్గొనేలా చేసి, వారి అభిప్రాయాలు కచ్చితంగా తెలుసుకునేవారు. ‘భక్తప్రహ్లాద’, ‘కాళిదాసు’ (తమిళం) తర్వాత అనేక చిత్రాలు డెరైక్ట్ చేశారు. ప్రొడ్యూస్ చేశారు. సావిత్రి, సీతాస్వయంవరం, ఉష (హిందీ), గృహలక్ష్మి, మాతృభూమి (తమిళం), తెనాలి రామకృష్ణ, సత్యమే జయం, జస్టిస్ (హిందీ), ప్రతిష్ట తదితర చిత్రాలు ఆయన రూపొందించారు. హెచ్.ఎం.రెడ్డి చేసినన్ని ప్రయోగాలు, పరిచయాలు అన్నీ ఇన్నీ కావు. చిత్రనిర్మాణంలో అనేక కొత్త మార్పులకు మార్గదర్శకుడాయన.
…………………
తొలి హీరో
ప్రహ్లాదుని పాత్ర పోషించిన సింధూరి కృష్ణారావు వయసు భక్త ప్రహ్లాద చేసేనాటికి తొమ్మిదేళ్లు. టైటిల్స్‌లో మాస్టర్ కృష్ణ అని పడుతుంది. ఖమ్మంలో పుట్టిన కృష్ణారావు అప్పటికే వివిధ నాటకాల్లో బాలకృష్ణుడు, కనకసేనుడు, ప్రహ్లాదుడు, లోహితాస్యుడు వంటి పాత్రలు పోషించారు. ప్రహ్లాదుని పాత్ర కోసం బొంబాయి వచ్చిన ఐదుగురు పిల్లల్ని పరీక్షించారు హెచ్.ఎం.రెడ్డి. కృష్ణారావు పాడిన ‘అమ్మా ఇటు బంగారు బండి నాకియ్యవే’ పాట విని అతణ్ని ఎంపిక చేసుకున్నారు.
ఈ సినిమాలో చేసినందుకు 400 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఆయన చేసింది ఇదొక్క సినిమానే. బొంబాయిలో మతకలహాలు రావడంతో భయపడి అతని తల్లిదండ్రులు ఊరికి తీసుకుపోయారు. అక్కడ సురభి నాటక సమాజంలో హార్మోనిస్టుగా చేరారు. ఆ తర్వాత కిరాణాకొట్టు పెట్టుకున్నారు. చివరకు కూలి పని కూడా చేశారు. ఈ వృద్ధ ప్రహ్లాదుని గురించి తెలుసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) 2001లో ఆర్థిక సాయం కూడా చేసింది. 2004 చివర్లో ఆయన కన్ను మూశారు.
తొలి విలన్
సుబ్బయ్య అసలు పేరు వల్లూరు వెంకట సుబ్బారావు. స్వగ్రామం గుంటూరు జిల్లా మునిపల్లె కావడంతో అదే పేరుతో పిలిచేవారు. వెంకటగిరి రాజా వారిచేత ‘నటశేఖర’ బిరుదు పొందారు. ‘సురభి’ సమాజంలో అత్యధిక పారితోషికం తీసుకునే ఆయన, 1929లో తండ్రి చనిపోవడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చారు.
హెచ్.ఎం.రెడ్డి కోరిక మేరకు దొరస్వామినాయుడు (ఇంద్రుడు పాత్రధారి) మునిపల్లె వెళ్లి, సుబ్బయ్యను బొంబాయి తీసుకువెళ్లారు. ప్రహ్లాదుని పేరుమీదుగా సినిమా ఉన్నా, తెరమీద ఎక్కువగా కనిపించేది హిరణ్యకశిపుని పాత్రధారి సుబ్బయ్యే. ‘ద్రౌపదీ మాన సంరక్షణం’, ‘సతీ సులోచన’ తదితర చిత్రాల్లోనూ సుబ్బయ్య నటించారు.
…………………
మరో రెండు భక్త ప్రహ్లాదలు
భక్త ప్రహ్లాద గాథ ఆ తర్వాత మరో రెండుసార్లు తెరకెక్కింది. 1942లో శోభనాచల బ్యానర్‌లో ఇదే పేరుతో సినిమా వచ్చింది. వేమూరి గగ్గయ్య, రాజేశ్వరి, నారాయణరావు, జి.వరలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. 1967లో ఏవీఎం బ్యానర్లో ఎస్వీరంగారావు, అంజలీదేవి, రోజారమణి ప్రధాన తారాగణంగా రంగుల్లో రూపొంది, అఖండ విజయం సాధించింది. ఈ రెండింటికీ చిత్రపు నారాయణమూర్తి దర్శకుడు.
…………………..
తొలి హీరోయిన్
‘సురభి’ కమలాబాయి ఫ్యామిలీ అంతా రంగస్థల కళాకారులే. యాదృచ్ఛికంగా కమలాబాయి కూడా రంగస్థలం మీదే జన్మించారు. 18 ఏళ్ల వయసులో కమలాబాయి భక్త ప్రహ్లాద చేశారు. పారితోషికం 500 రూపాయలకు మాట్లాడుకున్నారు.
కానీ పాల ఖర్చులకే మొత్తం అయిపోవడంతో నిర్మాత దయతలచి వెయ్యినూట పదహార్లు, రైలు ఖర్చులు ఇచ్చి పంపించారు.‘భక్తప్రహ్లాద’ తర్వాత వచ్చిన ‘పాదుకా పట్టాభిషేకం’, ‘శకుంతల’ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. విజయావారి ‘పాతాళభైరవి’ (1951)లో ఎన్టీఆర్ తల్లిగా నటించింది ఆమే.
తొలి గీతరచయిత
చందాల కేశవదాసు ప్రసిద్ధ నాటక రచయిత. ‘కనకతార’ ఒక్కటి చాలు ఆయన ప్రతిభ గురించి చెప్పడానికి. ఆ పేరు ప్రఖ్యాతులు వినే హెచ్.ఎం.రెడ్డి ఆయనను పిలిపించుకున్నారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు నాటకంలో రాసిన పాటలు, పోతన భాగవత పద్యాలు ఉన్నా కూడా కేశవదాసుతో మూడు పాటలు రాయించుకున్నారు.
సురభి కమలాబాయిపై చిత్రీకరించిన ‘పరితాప భారంబు భరియింప తగునా’, ‘తనయా ఎటులన తగదుర పలక’… మునిపల్లె సుబ్బయ్యపై తీసిన ‘భీకరమగు నా ప్రతాపంబునకు భీతిలేక’ పాటలు రాశారు. నాటక క్రమంలోనే సినిమా తీశారు కాబట్టి, ఈ సినిమాలో మొదట వచ్చే పాట ‘వింతాయెన్ వినన్ సంతసమాయెనుగా’. అదే మన తొలి తెలుగు సినిమా పాట.
అది రాసింది ధర్మవరం రామకృష్ణమాచార్యులు. అయితే ఈ సినిమా నిర్మాణం నాటికి ఆయన బతికిలేరు. అప్పటికి చందాల కేశవదాసు ఉన్నారు కాబట్టి ఆయననే తొలి సినీకవిగా పేర్కొనడం సమంజసమని తెలుగు సినిమా పాటపై పరిశోధన చేసిన డాక్టర్ పైడిపాల చెబుతారు.
తొలి సంగీత దర్శకుడు
కర్ణాటకలోని హోస్పేటలో పుట్టిన హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రిది సంగీత కుటుంబం. ‘భక్త ప్రహ్లాద’కు పనిచేసే నాటికి ఆయన వయసు కేవలం పదిహేడేళ్లే. ‘భక్త ప్రహ్లాద’ పాటలూ పద్యాలూ గ్రామఫోను రికార్డుగా రాకపోవడంతో అవి మనకు ఎక్కడా వి(క)నబడవు. ఈ సినిమా తర్వాత పద్మనాభశాస్త్రి ‘చిత్రనళీయం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘ఘరానాదొంగ’ తదితర చిత్రాలకు స్వరాలందించారు. నాగయ్య ‘భక్త రామదాసు’ శాస్త్రి పని చేసిన ఆఖరి సినిమా.
………………
ఆ తరం ప్రేక్షకుడి స్పందన
‘‘ఇప్పుడు నా వయసు 92. పన్నెండేళ్లప్పుడు గుడివాడలోని ‘మారుతి మరీదు’ థియేటర్లో ‘భక్తప్రహ్లాద’ చూశా. రీలు రీలుకీ ఇంటర్వెల్ ఉండేది. ప్రతి పావుగంటకీ అన్నమాట. సినిమా అచ్చం స్టేజ్ మీద నాటకం చూస్తున్న అనుభూతినే కలిగించింది. అదే కథ, అదే నటీనటులు కదా! అందుకే అలా అనిపించి ఉండొచ్చు. అయినా సినిమా అనే కొత్త ప్రక్రియ మా తరానికి ఆశ్చర్యం కలిగించింది.’’ మద్దాలి సత్యనారాయణ శర్మ సీనియర్ జర్నలిస్టు
పులగం చిన్నారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి