24, ఫిబ్రవరి 2011, గురువారం

రమణీయం

తెలుగుజాతి 'మాట'ను కోల్పోయింది. సాహిత్యంలో, మరీ ముఖ్యంగా చలనచిత్రసీమలో సునిశిత హాస్యాన్ని అసమానంగా పండించిన మితభాషి ముళ్లపూడి వెంకటరమణ సాహితీ ప్రియులకు అమిత బాధను మిగిల్చి వెళ్లిపోయారు.'రాత-గీత' ద్వయంలో (బాపు-రమణ)'రాత' నిష్క్రమించింది. బుడతజంట 'బుడుగు-సిీగాన పెసూనాంబ', యువజంట 'రాధా-గోపాళం' 'పక్కింటి లావుపాటి పిన్నిగారు, 'ఆవిడ మొగుడు', రెండుజెళ్లసీత, కలాపోసనగల మర్డర్ల కాంట్రాక్టర్, ఆయన సెగట్రీ, అద్దె భజంత్రీలు, నిత్యపెళ్లికొడుకు, అప్పుల అప్పారావు, 'తీతా', దొరవారి సహాయకుడు'కన్నప్ప'ఇలా ఒకరేమిటి...ఎన్నెన్నో పాత్రలతో పాటు తెలుగుపాఠక, ప్రేక్షకజనం.. మరీ ముఖ్యంగా హాస్యప్రియులు కలతచెందారు.

నీవుంటే వేరే కనులెందుకు..
'నీవుంటే వేరే కనులెందుకు..నీ కంటే వేరే బ్రతుకెందుకు నీ బాట లోని అడుగులు నావే' అంటూ స్నేహతత్వాన్ని ఆవిష్కరించిన ప్రాణస్నేహితులు. కొన్ని జంటలను వేర్వేరుగా చూడలే(రు)ము. ఉదాహరణకు, తెలుగు అవధాన ప్రక్రియకు వెలుగురేఖలు తిరుపతి వెంకటకవులను స్నేహానికి చిరునామాగా చెబుతారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి అస్తమించినా (1919) మిత్రులు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి తుది వరకు (1950) తమ సాహితీ వ్యాసంగాన్ని 'జంటకవులు' పేరుతోనే సాగించి మైత్రీబం«ధాన్ని కొనసాగించారు. ఇక తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఎన్ని జంటలు పని చేసినా తొలితరంలో 'నాగిరెడ్డి-చక్రపాణి' మలితరంలో 'బాపు-రమణ' చెప్పదగిన జంటలు. 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా' అన్న వేమన మాట ఈ 'స్నేహజంట'కు అమ్మ పాలంత స్వచ్ఛంగా పొసగుతుంది.

ఇది మెచ్చుకోలు కాదు.'అచ్చకోలు'.రెండు శరీరాలకు ఒకే ఆత్మ 'బాపు- రమణ' అంటారు అభిమానులు. 'ఒకే ఇల్లు,ఒకే ప్రాణం, ఒకే వ్యాపకం, బొమ్మా-బొరుసు, తోడు-నీడ... ఇలా అన్నీనూ! అందుకే 'బాపురే(ర)మణ' అన్నారు సినారె. అభిప్రాయభేదాలు అంటూ ఉంటే (వృత్తిపరంగా) అవి అంతవరకేనట! 'స్నేహం చేసే ముందు ఆలోచించు. ఆ తరువాత కడదాక కొనసాగించు' అన్న సూక్తి వీరిముందు వెలవెల పోవలసిందే. ఎందుకంటే వీరిది 'కాంట్రాక్టు/సిఫారుసు/మొహమాటం/అవసరాల'స్నేహం కాదు కాబట్టి.

'సిఫార్సులతో కాపురాలు చక్కబడవన్న' ముత్యాలముగ్గు నాయిక మాటలు స్నేహానికీ వర్తిస్తాయని రుజువు చేసింది ఈ జంట. ఇదే విషయాన్ని ముళ్లపూడి వారితో ప్రస్తావిస్తే, భార్యాభర్తల మధ్యకాని, స్నేహితుల మధ్య కానీ నమ్మకం ముఖ్యం అనేవారు. ఆ విషయాన్నే ఆయన సినిమా సంభాషణల్లో ఆవిష్కరించారు. నచ్చని వ్యక్తుల గురించి వ్యాఖ్యానించడం కంటే మౌనంగా ఉండడం ఉత్తమం అనీ మరీ చెప్పవలసి వస్తే వారి పేర్లు ప్రస్తావనకు రాకుండా క్లుప్తంగా సైగలతో చెప్పడం ఆయన ప్రత్యేకత. అదే సమయంలో నచ్చిన వ్యక్తి గురించి, నచ్చిన రచన గురించి ఢంకా బజాయించి కితాబు ఇచ్చేవారు. పూర్వకవులన్నా, వారి రచనలన్నా మక్కువ ఎక్కువ.

వారి పాత్రలకు కొనసాగింపునిచ్చి చిరస్మరణీయం చేసిన ఘట్టాలూ ఉన్నాయి. గురజాడ వారి అపురూప సృష్ట 'గిరీశం'. దానిని అందిపుచ్చుకున్న ముళ్లపూడి ఆ పాత్రతో ఉపన్యాసాలు (లెక్చర్లు)ఇప్పించారు. మొక్కపాటి 'బారిస్టర్ పార్వతీశం', చిలకమర్తి వారి 'జంఘాలశాస్త్రి', మునిమాణ్యిం 'కాంతం' పాత్రల మాదిరిగానే ముళ్లపూడి అనేక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అవన్నీ మధ్యతరగతి జీవితాల నుంచిపుట్టినవే.

మాటల బ్రహ్మ
విత్తు ముందా చెట్టు ముందా అనే సామెతకు ఈ ఇద్దరిమిత్రుల భావనలకు సామ్యం ఉంది. 'వాడికి (బాపు) కాంటెంపరరీగా ఉండడం మన అదృష్టం' అని రమణ అంటే 'నేనూ అంతే' అనే భావం వ్యక్తపరుస్తారు బాపు. అందుకే 'బాపు రమణీయం.' తమను మహానుభావులు అని ఎవరైనా సంబోధిస్తే 'మహా'కాదు..'ఉత్తభావుణ్నే' అని చెప్పుకున్న చమత్కారి. కంచర్లగోపన్న ఉరఫ్ రామదాసు రాముల వారి ఆలయాన్ని 'అప్పు'చేసి కట్టించారేమోనని హాస్యమాడారు. 'విష్ణుమూర్తులోరు స్వయంగా ప్రత్యక్షమై భక్తా ఏం కావాలో కోరుకోమంటే.. ముందు మా మేనమావ సెవిలో ఎంట్రుకలు మొలిపించు. తతిమ్మాది నేజూసుకుంటా' అని వరమడిగేసి, 'చెవి వెంట్రుకల' వెనుకున్న రహస్యం ఏమిటో ప్రేక్షకులకు వదిలేశారు. ఇలాంటి చమత్కార కలానికి హాస్యం 'రుణపడిలేదూ!'

గుండె గొంతుకలోన...
తక్కువ అక్షరాల్లో ఎక్కువ అర్థం చెప్పాలన్న సత్యం ముళ్లపూడి శైలిలోను, ఆయన వ్యక్తిత్వంలోనూ కనిపిస్తుంది. .తక్కువ మాట్లాడు ఎక్కువ పనిచేయి' అనే సూక్తో, 'గంగిగోవుపాలు గరిటడైనను చాలు' అనే శతకకర్త మాట అందుకు స్ఫూర్తో తెలియదు. ఆచరణలో మాత్రం అది స్పష్టమయ్యేది. ఇటీవల రవీంద్రభారతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ జాతీయ పురస్కారాన్ని అందుకున్న సందర్భంలో ఆయన స్పందనే అందుకు తాజా ఉదాహరణ.

'ఆనాడు ఆయన (ఎన్టీఆర్) ఆదరించారు-ఇప్పుడు మీరు (లక్ష్మీపార్వతి) ఆదరించారు' అని ఒకే ముక్కతో ధన్యవాదాలు చెప్పారు. అవునూ! ఇంత 'మితభాషు'లు అన్ని కళాఖండాలు ఎలా సృష్టించారన్నది అభిమానుల సందేహం. ఫలాని వారి మరణం తీరనిలోటు అని వినిపించే మాటల్లో ఎంత నిజమో కానీ 'ముళ్లపూడి' నిష్క్రమణ విషయంలో మాత్రం అది నిఖార్సైనదే. 'గుండె గొంతుకలోన కొట్లాడుతాది' అన్న నండూరి వారి మాటకు అర్థం ఈ విషాదవేళ స్ఫురిస్తోంది. 


source: ఆంధ్రజ్యోతి 25-02-2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి