ఆయన ఒక్క డైలాగ్ చాలు సినిమా సూపర్ హిట్టవ్వడానికి. సూపర్‌స్టార్ అన్న బిరుదు బహుశా ఆయన కోసమే పుట్టిందేమో. ఒక్క తమిళనాడులోనే కాక దేశవిదేశాల్లో కూడా ఆయనకు అభిమానులున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకశైలి నేర్పరుచుకున్న విలక్షణ నటుడాయన. ఆయన సినిమా విడుదలవుతుందంటే తమ సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు జంకుతారంటే అతిశయోక్తికాదు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల అభిమానుల మనసు చూరగొన్న ఏకైక నటుడు సూపర్‌స్టార్ రజనీకాంత్. రోబో సినిమా సూపర్‌హిట్‌తో ఆయన స్టార్‌డమ్‌కు తిరుగులేకుండా పోయింది. ఇటీవల అనారోగ్యంతో సింగపూర్‌కు వెళ్లి అక్కడ చికిత్స చేయించుకొని పూర్తి స్వస్థతతో దేశానికి తిరిగి వచ్చారు. నూతనోత్సాహంతో సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు.
దేశవిదేశాల్లో సైతం మార్కెట్ ఉన్న నటుడెవరైనా ఉన్నారంటే అది రజనీ కాంత్ మాత్రమే. ఆయన ఒక్క డైలాగ్ చాలు రూ.వందల కోట్లు కురవ డానిి. భారత సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకొని ఇప్పటికీ యంగ్‌స్టార్‌లా దూసుకుపోతున్నాడు.
మామూలు బస్ కండక్టర్ స్థాయి నుండి సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగిన ఆయన జీవితం సగటు సినీ జీవికి ఆదర్శప్రాయం. ‘అపూర్వ రాగంగళ్’ అనే తమిళ చిత్రం ద్వారా ప్రారంభమైన రజనీ నటనా ప్రస్థానం ఇటీవల ‘రోబో’ సినిమా సూపర్‌హిట్‌తో అప్రతిహతంగా కొనసాగుతుంది. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ భాషలతో పాటు బెంగాళీ, ఇంగ్లీష్ భాషల్లో సైతం నటించి తన నటనా కౌశలాన్ని అన్ని ప్రాంతాల ప్రజలకు చూపించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం... ‘నా సినిమాలకంటే... రజనీకాంత్ సినిమాలకే ఎక్కువ మార్కెట్ ఉంటుంది.’ అని అన్నాడంటే రజనీ ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తన కెరీర్‌లో 150కి పైగా సినిమాల్లో నటించిన రజనీకాంత్ భారత మూడవ అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మభూషన్’తో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.
రజనీగా మారిన శివాజీ...
చిన్నప్పుడు రజనీకాంత్ హీరో అవుతాడని ఎవ్వరూ ఊహించకపోవచ్చు. హీరో అంటే అందంగా చూడగానే ఆకట్టుకునే రూపం, మంచి పర్సనాలిటీ ఇవన్నీ ఉండాలి. రజనీకాంత్‌కు ఈ లక్షణాల్లో ఏవీలేవు. అయినా అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకొని తన డిఫరెంట్ స్టైల్‌తో అంచెలంచెలుగా ఎదిగి నేడు సూపర్‌స్టార్‌గా అభిమానుల నీరాజనాలు అందు కుంటున్నారు. విశిష్ట దర్శకుడు బాలచందర్ శివాజీరావులోని స్పార్క్‌ని గుర్తించారు.
ఆ కుర్రాడికి రజనీకాంత్‌గా పేరు మార్చారు. ‘అపూర్వ రాగంగళ్’ అనే సినిమాలో అవకాశం ఇచ్చి పేరుతో పాటు రాతను కూడా మార్చారు. అక్కడి నుండి రజనీకాంత్ వెనక్కితిరిగి చూసుకోలేదు. తను నటించిన ప్రతి చిత్రంతో నూ ఒక్కో మెట్టును అధిరోహిస్తూ... ఈ రోజు చిత్రసీమలో ఎదురులేని రారాజుగా వెలుగొందుతున్నారు. తొలుత తమిళ చిత్రాల్లో విలన్‌గా అరంగేట్రం చేసి, ఆ తరువాత హీరోగా అంచెంలంచెలుగా ఎదిగి ప్రస్తుతం స్టైల్‌కి మారుపేరుగా, స్పీడ్ కింగ్‌గా, స్టార్‌డమ్‌కి పర్యాయపదంగా మారారు రజనీ కాంత్.
రజనీకాంత్ తలతిప్పినా, కన్ను కదిపినా, కాలు కదిపినా సంచలనమే. స్టైల్‌లో ఆయనకాయనే సాటి. సిగరెట్‌ను గాల్లోకి ఎగిరేసి పెదాలతో పట్టుకోవడం, దాన్ని అగ్గిపుల్లతో ఇంకా స్టైల్ గా వెలిగించుకోవడం లాంటి స్టైల్స్ ఇండియన్ స్క్రీన్‌పై మరెవ్వరికీ సాధ్యం కాదంటే అతిశయోక్తికాదు. కమల్ హాసన్‌లా ఆయనకు నేషనల్ అవార్డు రాకపోవచ్చు. కానీ ప్రేక్షకుల చప్పట్లు, ఈలలే ఆయనకు వేలకొద్ది నేషనల్ అవార్డులతో సమానం. దక్షిణ భారత చలన చిత్ర చరిత్రలో ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌ల తరువాత అంతులేని అభిమాన జన సం దోహం ఉందంటే అది రజనీకాంత్ ఒక్కడికే. మరే నటుడికి కూడా ఇంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదంటే అతిశయోక్తి కాదు.
బహుభాషా నటుడు...
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో 1975లో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ చ్రితం ద్వారా తొలిసారిగా వెండితెర రంగప్రవేశం చేశారు రజనీ కాంత్. తొలుత విలన్‌గా నటించిన రజనీకాంత్ ఆ తరువాత హీరోగా మారారు. 1978లో వచ్చిన ‘భైరవి’ సినిమాతో ‘సూపర్ స్టార్’గా మారారు. ఆ తరువాత ఇక రజనీ దశ తిరిగింది. ఒక్కసారిగా అభిమానులు పెరగసాగారు. నటించిన ప్రతి సినిమాలో వైవిద్యాన్ని ప్రదర్శిస్తూ... అనతికాలంలోనే విలక్షణ నటుడిగా ఎందరో ప్రముఖుల ప్రశంసలందుకున్నారు.
‘ముళ్ళం-మళురుం’ సినిమాలో నటనకు గురువు బాల చందర్ రాసిచ్చిన ప్రశంసా పత్రమే తనకు అరుదైన అవార్డుగా చెబుతారు రజనీకాంత్. రమణ మహర్షి సాహిత్యాన్ని ఎక్కువగా చదివి, అభిమానించే రజనీ ‘అంతులేని కథ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘ఆమె కథ’, ‘వయసు పిలిచింది’, ‘ఇద్దరూ అసాధ్యులే’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. టాలీవుడ్‌లో కూడా ఆయనకు అశేషమైన అభిమానులున్నారు. గత దశాబ్ద కాలం నుండి ఆయన నటించిన ప్రతి సినమా కూడా తెలుగులోకి అనువాదం కావడ మే అందుకు తార్కాణం.
ఆయన నటించిన అనువాద చిత్రాలు ‘భాషా’, ‘ముత్తు’, ‘నరసింహ’, ‘చంద్ర ముఖి’, ‘శివాజీ’ అన్ని చిత్రాలు తెలుగునాట విజయఢంకా మోగించినవే. రజనీ కాంత్ అతిథిపాత్రలో నటించిన ‘పెదరాయుడు’ సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినా ఆ చిత్ర విజయంలో రజనీకాంత్ పాత్రనే ఎక్కువ అనేది కాదనలేని విషయం. తెలుగులోనే కాక కన్నడ, హిందీ భాషల్లో కూడా అనేక సినిమాలలో నటించారు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లకు సైతం పోటీగా నిలిచారు. ‘గిరఫ్తార్’ లాంటి 28 చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు.
మార్కెట్ లీడర్...
దేశంలోనే కాక విదేశాల్లో కూడా రజనీకాంత్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘శివాజీ’ సినిమా వసూలు చేసిన అంతర్జాతీయ కలెక్షన్లే అందుకు నిదర్శనం. రజనీ నటించిన ‘ముత్తు’ సినిమా జపనీస్ భాషలో కూడా డబ్ చేశారంటే ఆయనకు అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఊహించవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ రాబోతున్న ‘రోబో’ సినిమాలో ఇప్పటికే మార్కెట్ అంచనాలు మొదలయ్యాయి. రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వడం రజనీకాంత్‌కు అంత కష్టమేమీకాదు. పలు సందర్భాలలో కూడా ఆ విషయం స్పష్టమైంది.
1995లో ‘కుముదన్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వే ఫలితాలే ఇందుకు నిద ర్శనం. ఒకవేళ కాంగ్రెస్‌పార్టీకి రజనీ సపోర్ట్ చేస్తే 130 సీట్లకు పైగా గెలుచు కుంటుంది అని ఆ పత్రిక వెల్లడించింది. 34 ఏళ్ళుగా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న రజనీకాంత్ ఇకముందు కూడా మరిన్ని విజయాలు అందుకుంటాడని ఆశిద్దాం.
- ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లకు సైతం పోటీగా నిలిచారు. ‘గిరఫ్తార్’ లాంటి హిట్ హిందీ చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు.
- తొలుత తమిళ చిత్రాల్లో విలన్‌గా అరంగేట్రం చేసి, ఆ తరువాత యాంటీ హీరోగా, ఆ తరువాత హీరోగా అంచెంలంచెలుగా ఎదిగి ప్రస్తుతం స్టైల్‌కి మారుపేరుగా, స్పీడ్ కింగ్‌గా, స్టార్‌డమ్‌కి పర్యాయపదంగా మారారు రజనీ కాంత్.
- బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఒక సందర్భంలో రజనీకాంత్‌ను ‘ఎంపరర్ ఆఫ్ ద బాక్సాఫీస్’ అని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాకుండా ఆయనలాగా నేను స్టైలిష్‌గా నటించడం నావల్లకాదు అని ఒప్పుకున్నాడు. ‘శివాజీ’ సినిమా విడుదల సందర్భంగా చేపట్టిన సర్వేలో కూడా రజనీకాంత్‌నే సూపర్‌స్టార్‌గా ఎంచుకున్నారు అభిమానులు.
- దక్షిణ భారత చలన చిత్ర చరిత్రలో ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌ల తరువాత అంతులేని అభిమాన జన సందోహం ఎవరికైనా ఉందంటే అది రజనీకాంత్ ఒక్కడికే. ప్రొఫైల్
పేరు : రజనీకాంత్
అసలుపేరు : శివాజీరావు గైక్వాడ్
పుట్టిన తేది : డిసెంబర్ 12
తల్లిదండ్రులు : రాంబాయ్, రామోజీరావు
సోదరులు : సత్యనారాయణరావు, నాగేశ్వరరావు
భార్య : లత
పిల్లలు : ఐశ్వర్య, సౌందర్య
అల్లుడు : ధనుష్ (హీరో)
ఇష్టమైన నగరం : చెనై్న
ఇష్టమైన రంగు : నలుపు
ఇష్టమైన ఆహారం : చికెన్, మటన్
బాధపడిన క్షణం : కండక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసినక్షణం
ఇష్టమైన స్థలం : హిమాలయాలు, ఇంట్లో పూజగది
మొదటి చిత్రం : అపూర్వ రాగంగల్
గురువు : కె.బాలచందర్
ఫేవరెట్ డ్రస్ : వైట్‌కుర్తా
అభిమాన నటులు : కమల్‌హాసన్, సిల్వెస్టర్ స్టలోన్
అభిమాన నటి : రేఖ
ఇష్టమైనసంగీత దర్శకుడు : ఇళయరాజా
ఇష్టమైన నాయకుడు : లీ కుయాన్-యు
సూర్య పత్రిక సౌజన్యంతో.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి