6, డిసెంబర్ 2011, మంగళవారం

తెలుగు సినిమాల్లో తెలుగెంత?

నేతి బీరకాయలో నేయి ఉంటుందా?
పులిహోరలో పులి ఉంటుందా?
మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా?

chiru-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఈ ప్రశ్నలు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలో తెలుగు భాష- సంస్కృతి పరిస్థితి అలాగే ఉంది. తెలుగులో తొలి టాకీ సినిమా విడుదలై నిన్నటికి ఎనభై సంవత్సరాలు. ప్రస్తుతం 81 వ ఏట అడుగు పెట్టిన తెలుగు సినిమాలో తెలుగుదనం ఎంత?గత కొంతకాలం నుంచి మనకు తరచూ వినిపిస్తున్న మాట... అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న మాట...‘తెలుగు భాష కనుమరుగై పోతోంది. తెలుగు భాషలో తెలుగు భ్రష్టుపట్టిపోతోంది. తెలుగుకు తెగులు తగులుకుంది’ అని. అయితే ఈ పరిణామం ఒక్క భాషకు మాత్రమే కాదు. సర్వకళల సమాహారమైన తెలుగు సినిమాకూ తప్పడం లేదు. జీవసంస్కృతులను కొనసాగించేవి కళలే అనుకుంటే, అలాంటి కళలన్నింటికీ రారాజు అయిన సినిమాలో మాత్రం తెలుగుదనం ఏమేరకుంది అని ఆలోచించాల్సిన తరుణం ఏర్పడిందిప్పుడు. కథల్లో, కాస్ట్యూమ్స్‌లో, లొకేషన్స్‌లో, మాటల్లో, పాటల్లో, యాక్షన్‌లో... ఆఖరికి హీరోయిన్‌లలో, సినిమా టైటిల్స్‌లో అసలు తెలుగెంత అని ఆలోచిస్తే నిరాశే ఎదురవుతుంది.

నేటికి 176 ఏళ్ల క్రితం...తెలుగు సినిమా పుట్టడానికి 104 ఏళ్ల కిందట
1835వ సంవత్సరం...బ్రిటీష్ పార్లమెంట్‌లో భారతదేశంలో విద్యావిధానంపై చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా నియమించిన కమిటీ ఛైర్మన్ అయిన లార్డ్‌మెకాలే సభకు వివరణ ఇస్తున్నాడు... సభలో ప్రతిపక్ష సభ్యుడొకరులేచి అసలు భారతదేశంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం వల్ల మనకొచ్చే ప్రయోజనమేంటి? అనడిగాడు. అప్పుడు మెకాలే చిన్నగా గొంతు సవరించుకుని ఇలా చెప్పాడు ‘by this system of english education, they may be indians by blood and color, But will become britishers in tastes, opinions, manners and intellect’ (ఆంగ్ల విద్యా విధానం వల్ల రంగు-రక్తం- పరంగా భారతీయులైన వీరంతా అభిరుచులు- అభివూపాయాలు- పద్ధతులు, మేధాశక్తి పరంగా క్రమక్షికమంగా బ్రిటీష్‌వారిగా మారుతారు)
మెకాలే కల నిజమైంది.

ఇలాంటి సాంస్కృతిక విధ్వంసమే ఇప్పుడు తెలుగు సినిమాకూ జరుగుతోంది. తెలుగుదనం, తెలుగు అని గొప్పగా చెప్పుకొంటున్న జనాలు చూసే తెలుగు సినిమాల్లో తెలుగుదనం ‘నేతి’గా మారింది.

కథల సంగతి
సినిమాకు కథే ప్రాణం! చాలా ప్రెస్‌మీట్లలో అందరూ చెప్పే అరిగిపోయిన మాట ‘స్క్రిప్టే మా హీరో’ అని. అంటే తెలుగు సినిమా భవనానికి పునాది కథ అన్నమాట. కానీ 1931 నుంచి ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన సినిమాలన్నిటినీ గమనిస్తే , ఇందులో తెలుగుదనాన్ని ప్రతిబింబించిన కథపూన్ని? అసలు తెలుగు కథపూన్ని? అని పరిశోధన చేస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేము. ఈ ఎనభై ఏళ్లకాలంలో తెలుగులో దాదాపు 5900 సినిమాలు వచ్చాయి. వాటిలో 65 శాతం పైగా సినిమాలకు మూల కథలు బెంగాలీ, హిందీ, తమిళం, మలయాళం సినిమాలే. అంటే కేవలం 35 శాతం సినిమాలు మాత్రమే మనదైన సొంత కథలలతో రూపొందాయన్నమాట. మిగతావన్నీ అరువు కథలో లేక రీమేక్‌లో అన్నమాట. ఆ లెక్కన అసలు సినిమాకు ఆది పునాది అయిన కథే మనది కానప్పుడు సినిమాలు మాత్రం మన అవుతాయి?
1950,60వ దశకాలలో తెలుగు సినిమాలకు ముడి సరుకు అంతా బెంగాళీ కథలే. ఆ తర్వాత 1970,80 దశకాల్లో సూపర్‌హిట్ అయిన హిందీ సినిమాలను రీమేక్ చేయడం ఓ వెల్లువలా సాగింది. 1980,90 దశకాల కాలం నుండి తమిళ సినిమా రీమేక్‌లు విజృంభించాయి. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. తెలుగు సినిమా అన్ని తరాలలోని సూపర్ హీరోలందరూ పరభాషా కథలతో, సినిమాలు తీసినవారే. దేవదాసు, బాటసారి వంటి సినిమాలు బెంగాలీ సినిమాలకు రీమేక్‌లే.

అన్నదమ్ముల అనుబంధం(యాదోంకీ బారాత్), నిప్పులాంటి మనిషి(జంజీర్), అమరదీపం(ముకద్ధర్ కా సికిందర్), తూర్పు పడమర(అపూర్వ రాగంగాళ్), పదహారేళ్ల వయసు(పదునారు వయదినిలే) వంటి సినిమాలన్నీ రీమేక్‌లే. చిరంజీవి చేసిన త్రినేవూతుడు(జల్వా), ఘరానామొగుడు(మన్నన్), స్నేహం కోసం( నాట్లామై), హిట్లర్(), ఠాగూర్(రమణ).... వంటి సినిమాలన్నీ పరభాషా కథలతో నిర్మాణమైనవే. మోహన్‌బాబు నటించిన అల్లుడుగారు, తప్పుచేసి పప్పుకూడు, పెదరాయుడు వంటి సినిమాలకు మలయాళ కథలే ఆధారం. ఇక వెంక అయితే పరాభాషా కథలతో తెలుగు సినిమా నిర్మాణానికి కేరాఫ్‌గా మారారు. చంటి(చిన్నతంబి), రాజా, శీను, కొండపల్లి రాజా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నాగవల్లి, లేటెస్ట్‌గా రాబోతున్న ‘గంగ ది బాడీగార్డ్’ కూడా రీమేక్‌లే. నేటితరం హీరోల్లో ‘నా ఆటోక్షిగాఫ్(ఆటోక్షిగాఫ్), దొంగోడు(మీసమాధవన్), వీడే(ధూల్), అన్నవరం(తిరుప్పాచ్చి), ఖుషీ, తీన్‌మార్(లవ్ ఆజ్‌కల్), బిల్లా, నాని(న్యూ), లక్ష్మీ నరసింహా(సామి), ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న గబ్బర్ సింగ్(దబంగ్) సినిమాలూ అలాంటివే.ఇక తెలుగు సినిమాలలో హాలీవుడ్ కథల కాపీయింగ్, ఫ్రీమేకింగ్ అనేది గత ఎనభై ఏళ్లుగా సాధారణ సత్యమైపోయింది. ‘ఇన్‌స్పిరేషన్’అనే అందమైన పేరుతో హాలీవుడ్ కథలను అరువు తెచ్చుకోవడం ఓ తప్పనిసరి అంశమైపోయింది.అయితే భాషా వ్యాప్తిలోనూ, సంస్కృతి విస్తరణలోనూ కళారూపాల సార్వజనీనతలోనూ ఇలాంటి ‘ఆదాన ప్రదానాలు’ సర్వసాధారణమే. ఇలాంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణుల వల్ల సినిమా కళ కూడా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇచ్చిపుచ్చుకోవడంలో ‘పుచ్చుకోవడం’ ఎక్కువైపోవడమే ఒకింత బాధాకరం.

క్యాస్టూమ్స్ లొకేషన్స్
సినిమా కళలో పాత్ర స్వభావాన్ని ఇట్టే వ్యక్తీకరించే సాధనం క్యాస్టూమ్స్. ఆహార్యం అని మన ప్రాచీన అలంకారికులు పిలిచే కాస్ట్యూమ్స్- మేకప్ విషయంలో కూడా తెలుగేతర సంస్కృతే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో హీరోల డ్రెస్‌కోడ్ ఎక్కువగా సూటు-బూటు ఉండేవి (మెకాలే ఊహకు సాక్ష్యాలివే). ఆఖరికి పాటలోని సంగీత వాయిద్యం తబలా ధ్వని అయినప్పటికీ దృశ్యంలో మాత్రం ‘పియానో’ మీద పాడుతున్నట్టుగా చూపించిన తీరే (పగలే వెన్నెలా) తెలుగు సినిమాల్లో తెలుగుదనం కనుమరుగవుతున్న క్రమంలో జరిగిన తొలి పరిణామాలని చెప్పాలి.ఇక 1970, 80 దశకాలలో‘మాస్ హీరో’ పేరుతో హీరోలకు వేసే కాస్ట్యూమ్స్‌లో ఎక్కడా తెలుగుదనం మచ్చుకైనా కనిపించదు. పైగా బెదిరిపోయే కలర్స్(యెల్లో షర్ట్, రెడ్ ప్యాంట్ వంటివి)తో డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్స్‌ని చూస్తే కుక్కలు వెంటపడటం ఖాయం అనిపించేది.

1990 దశకం నుంచి హీరోల కాస్ట్యూమ్స్ కొంతవరకు కంటెంపరరీ ధోరణిని, మన నేటివిటీని ప్రతిబింబించినప్పటికీ, హీరోయిన్‌ల కాస్ట్యూమ్స్ మాత్రం హాలీవుడ్ స్టయిల్‌లోకి వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు యంగ్‌హీరోలు, హీరోయిన్లు వేస్తున్న కాస్ట్యూమ్స్, హెయిర్ స్టయిల్స్, గెటప్స్ సంగతి తెలిసిన విషయమే.‘లొకేషన్’ అనేది సినిమా కథలోని మూడ్‌ను, స్థితిని చెప్పే ‘అదృశ్య క్యారెక్టర్’ అని అంటారు. ఇప్పటి సినిమాల్లో ‘విజువల్ రిచ్‌నెస్’, ‘డిఫంట్ లుక్’ పేరుతో ఇతర రాష్ట్రాలు, ఆఖరికి సినిమా మొత్తం (ఆంజ్) విదేశాల్లోనే చిత్రించడం పెరిగిపోయింది. ఇలా మనవి కాని లొకేషన్లు, ప్రదేశాలలో సినిమాని తీయడం కూడా నేటి సినిమాల్లో తెలుగుదనం ఎంత అనే ప్రశ్న ఉత్పన్నమవడానికి దారి తీస్తోంది.

టాలీవుడ్ ఏంటి?
అనుకరణ ‘కాపీ క్యాట్ కల్చర్’కు తెలుగు సినీ పరిక్షిశమను ఇప్పుడు పిలుస్తున్న ‘టాలీవుడ్’ అనే పేరే నిఖార్సయిన ఉదాహరణ. 1960ల వరకు ‘తెలుగు చలన చిత్ర సీమ’ అనే పేరు కాస్తా 1970 తర్వాత ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ అయింది. గత 15ఏళ్ల నుండి శాటిలైట్ టీవీ ఛానెల్స్, వెబ్‌సైట్స్ విజృంభించాక ‘టాలీవుడ్’ అంటూ ప్రచారంలోకి వచ్చింది. అమెరికన్ ఇంగ్లీష్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. దానికి అనుకరణగానే ఈ పేరు వ్యవహారంలోకి వచ్చింది(పేరులో కూడా సొంత తనం లేదు!). అయితే టాలీవుడ్ అనే పేరు ఎంతవరకు సరైంది అనేది మరో ప్రశ్న. ఎందుకంటే టాలీవుడ్ అనే పేరును మనదేశంలో రెండు సినీ పరిక్షిశమలకు ఉపయోగిస్తున్నారు. అవి బెంగాలీ సినీ పరిక్షిశమ, మన తెలుగు చిత్ర పరిక్షిశమ. బెంగాలీ పరిక్షిశమను టాలీవుడ్ అనడంలో అర్థం ఉంది. ఎలాగంటే కోల్‌కతాలోని ‘టాలీగంజ్’ అనే ప్రాంతంలో బెంగాలీ సినీ పరిక్షిశమ ఉంది కనుక. ఆ ఏరియా పేరుతో టాలీవుడ్ అని పిలవడం ఔచిత్యంగా అనిపిస్తోంది. కాని మనకెంత వరకు ఇది రైట్? పైగా ఆ మధ్య హీరో రానా మన సినీ పరిక్షిశమను టాలీవుడ్ అని పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. చక్కగా మన భాషలో తెలుగు చలన చిత్ర పరిక్షిశమ అనొచ్చు కదా అనేది ఆయన వాదన.

దిగుమతి హీరోయిన్‌లు
Saloni-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaసినిమాకు గ్లామర్‌ను, ఆడియెన్స్‌కు మనోల్లాసాన్నిచ్చే తెర సుందరి హీరోయిన్. కానీ తెలుగు తెరపై గత కొన్నేళ్ల నుంచీ తెలుగు అమ్మాయిలు హీరోయిన్ పాత్రల్లో కనిపించడం లేదు. హీరోయిన్ అనగానే- సావిత్రి, జమున, కృష్ణకుమారి గుర్తొచ్చేవారు. ఆ తర్వాతి తరంలో వాణిశ్రీ, ఆ నెక్ట్స్ తరంలో జయవూపద, జయసుధ. తెలుగు హీరోయిన్లలో విజయశాంతి, భానువూపియలదే చివరి తరం. ఇప్పటి జనరేషన్ హీరోయిన్‌లందరూ దిగుమతి అవుతున్న వారే తప్ప తెలుగు వారు లేరు. లయ, స్వాతి, బిందుమాధవి వంటి అమ్మాయిలు హీరోయిన్‌లుగా చేసినప్పటికీ అంతగా హిట్ కాలేదు. అయితే ఈ దిగుమతి హీరోయిన్‌ల ట్రెండ్ ఇప్పుడే మొదలైంది కాదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలోనే వహీదా రెహమాన్(రోజులు మారాయి) వంటి వారితో వచ్చింది. ఆ తర్వాత శ్రీదేవితో ఊపందుకుని నగ్మా, సౌందర్యతో పతాకస్థాయికి చేరింది. ఆఖరికి తెలుగమ్మాయి’ అనే టైటిల్‌తో వస్తున్న సినిమాలో నటిస్తున్న సలోని కూడా తెలుగు అమ్మాయి కాదు. ఇక తెలుగు సినిమాల్లో తెలుగు అందం ఎక్కడ ఉంది?

సినిమా టైటిల్స్ కూడా...
తెలుగులో ప్రతి ఏటా దాదాపు 120 నుంచి 140 స్ట్రయిట్ చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటిలో దాదాపు 40 నుంచి 50 సినిమాలకు టైటిల్స్ ఇంగ్లీష్ పదాలు, పేర్లే ఉంటున్నాయి. టైటిల్స్ క్యాచీగా ఉండడం పబ్లిసిటీ పరంగా నిజమే కానీ, తెలుగుదనం పరంగా ఇది గొడ్డలిపెట్టే. ఈ విషయంలో తమిళ సినీ పరిక్షిశమను అభినందించకుండా ఉండలేం. అక్కడి సినిమాలకు తప్పనిసరిగా తమిళ పేర్లే పెట్టాలని ఇండస్ట్రీ అంతా నిర్ణయించుకున్నారు. ఆ మేరకే టైటిల్స్ అన్నీ తమిళంలోనే పెడ్తున్నారు. అక్కడి టైటిల్స్ ‘నేటివిటీ ఫీల్’తో ఎంతో కవితాత్మకంగా ఉంటున్నాయి. (కన్నత్తిల్ ముద్దమిట్టల్- చెక్కిలిపై చిరుముద్దు). అవే సినిమాలు తెలుగులో డబ్ అయ్యే సరికి ఇంగ్లీష్ టైటిల్స్‌లోకి మారుతున్నాయి.
ఉదా: యంతిరన్- తెలుగులో రోబో.
ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లో తెలుగుదనం కొరవడడానికి ఆదిలోనే బీజం పడిందని చెప్పాలి. తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’ టైటిల్‌ను తీసుకోండి. తెలుగు భాష ప్రకారం పేరు ఎలా ఉన్నా చివర మాత్రం ‘డు’ అనే ప్రత్యయం చేరడం సంప్రదాయం. ఆ లెక్కన భక్త ప్రహ్లాద సినిమా టైటిల్ భక్త ప్రహ్లాదుడు కావాలి. కానీ ఇక్కడ సంస్కృతంలోని ప్రహ్లాద కాస్తా హిందీలోని ప్రహ్లాదగా మారి తెలుగులో కూడా అదే పేరుగా ఫిక్స్ అయిపోయింది.

యాక్షన్-మాటలు- పాటలు
తెలుగు సినిమాల్లో తెలుగుదనం ‘మిస్’ అవడానికి యాక్షన్-ఫైట్ సీక్వెన్సులు కూడా ఓ కారణమే. ఫైట్స్‌ని తెరపై చూస్తున్నప్పుడు ఏ హాలీవుడ్ హీరో ముఖానికో మన తెలుగు హీరో ముఖాన్ని ‘మార్ఫింగ్’ చేసి పెట్టినట్టనిపిస్తాయి. అలాగే డైలాగులు, పాటల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. పాటల్లో ఇంగ్లీష్ వాక్యాలు, ర్యాప్ పదాలు ఇప్పటి సంగీత స్వరాలలో కామన్ అయిపోయాయి. తెలుగు వారి సంగీత వాయిద్యాలైన తబల, మృదంగం, వీణ వంటి స్థానాన్ని ఇపుడు డ్రమ్స్, గిటార్‌లు ఆక్రమించుకున్నాయి. ఇక కొన్ని సినిమాల్లోనైతే వెరైటీ పేరుతో ఏకంగా హిందీ(యే మేరా జహా- ఖుషీ), ఇంగ్లీష్( లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్- తమ్ముడు) పాటలనే పెట్టారు.

మాండలిక సినిమానే ఆశ
మెయిన్‌వూస్టీమ్ కమర్షియల్ సినిమా ‘తెలుగుదనాన్ని’ అట్నుంచి నరుక్కొస్తుంటే దాన్ని కాపాడుతున్నది మాత్రం మాండలిక సినిమానే అని చెప్పాలి. నేటివిటీ ఉన్న కథలు, జన జీవనంలోని సంఘర్షణలే ఇతివృత్తంగా తెలుగు సాహిత్యంలో మాండలిక కథలు(రాయలసీమ- తెలంగాణ- ఉత్తరాంధ్ర) ఎలా అయితే సజీవ భాష- సంస్కృతులతో వస్తున్నాయో, సినిమాల్లో కూడా తెలంగాణ, ఉత్తరాంధ్ర మాండలిక సినిమాలు విస్తృతంగా రావలసిన అవసరం ఉంది. చిల్లర దేవుళ్లు, మా భూమి, రంగుల కల, మట్టి మనుషులు, దాసి వంటి సినిమాలు ఇటీవలి జై బోలో తెలంగాణ, గంగ పుత్రులు వంటి సినిమాలు తెలుగు మట్టి పరిమళాలతో తెలుగుదనంలో కనిపిస్తాయి. ప్రస్తుత ప్రపంచం అంతా గ్లోబలైజ్ అవుతున్నా మెయిన్ స్ట్రీమ్ కల్చర్‌కు భిన్నంగా ఉప సంస్కృతులైన మాండలిక సినిమాలే విస్తృతంగా రావలసి ఉంది. అప్పుడు వేలాది మెకాలేలూ, వందలాది హాలీవుడ్‌లూ ఏమీ చేయలేవు.
మామిడి హరికృష
(16-09-2011 నమస్తే తెలంగాన దినపత్రిక సౌజన్యంతో...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి