6, మార్చి 2012, మంగళవారం

సమ్మెట గాంధీ ఇంటర్వ్యూ

ఇటీవల వచ్చిన ‘రాజన్న’ సినిమా చూసినవాళ్లంతా నాగార్జున, ఆయన కూతురిగా నటించిన చిన్న పాప ఆనీలతో పాటు మరో వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. సాంబయ్య తాతగా నటించి మెప్పించిన ఆ వ్యక్తి... సమ్మెట గాంధీ. నాటకాలలో ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకుని, సినిమాల్లో సైతం తనదైన ముద్ర వేయాలని ఆరాటపడుతున్న గాంధీ ఫన్‌డేతో పంచుకున్న అనుభవాలు...

మీ ఊరు, చిన్నతనం గురించి...?
మాది కృష్ణాజిల్లా మచిలీపట్నం దగ్గర నేలకొండపల్లె. అమ్మ, నాన్న, ముగ్గురు అన్నలు, ముగ్గురు అక్కయ్యలు... ఇదీ మా కుటుంబం. ఎస్సెస్సెల్సీ వరకూ దగ్గర్లోని ముంజులూరులో చదివాక, మచిలీ పట్నంలో టీచర్ ట్రైనింగ్ తీసుకున్నాను.

నటనమీద ఆసక్తి ఎందుకు కలిగింది?
8వ తరగతిలో ఉన్నప్పుడు మా టీచర్ జానకీబాయి ఓ నాటకం వేయించారు. నా మనసులో నటన మీద ఆసక్తి మొగ్గ తొడిగింది అప్పుడే. అప్పుడు మొదలైన ఆ ఆసక్తి ఇప్పటికీ తగ్గలేదు.

సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది?
అది చాలా పెద్ద కథ. 1970లో మా టీచర్ రాధాబాయి, వారి చెల్లెళ్లు నన్ను హైదరాబాద్‌లోని మైక్రో సెరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేర్పించారు. మూడేళ్లు చేశాక భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో చేరాను. అక్కడ కొంతమంది మిత్రులం కలిసి నాటకాలు వేసేవాళ్లం. నా సహోద్యోగి, స్నేహితుడు అయిన మురళీమోహన్ (దేవిశ్రీ ప్రసాద్‌కి బాబాయ్) సినిమాల్లో అవకాశమిప్పిస్తాను రమ్మంటూ మద్రాస్ తీసుకెళ్లారు. సత్యమూర్తిగారికి (దేవిశ్రీ తండ్రి) నన్ను పరిచయం చేశారు. దాంతో ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘చైతన్యం’లో నాకో చిన్న పాత్ర దొరికింది.

ఆ తరువాత...
గ్యాంగ్‌లీడర్, దాదర్ ఎక్స్‌ప్రెస్ వంటి ఓ పది చిత్రాల్లో వేషాలు వేశాను. కానీ పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత కళ్లముందు కనిపించింది. ముందు వాళ్లను స్థిరపడేలా చేయాలన్న ఉద్దేశంతో పదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాను.

మరి నాటకాల సంగతి...?
వాటిని ఎప్పుడూ వదులుకోలేదు. ఓ పక్క పిల్లల్ని పెంచుతూనే నాటకాలు వేసేవాణ్ని. యర్రంనేని చంద్రమౌళి, దీన్‌బద్రు, భానుప్రకాశ్ తదితరుల దర్శకత్వంలో పలు నాటకాల్లో నటించాను. ప్రముఖ సినీ, రంగస్థల రచయిత దర్శకుడు ఆకెళ్ల రాసిన శ్రీనాథుడు, అల్లసాని పెద్దన, రాణి రుద్రమలాంటి చారిత్రాత్మక నాటకాలు చాలా పేరు తెచ్చాయి. ఆ క్రమంలోనే 2003లో ‘అల్లసాని పెద్దన’లో శ్రీకృష్ణదేవరాయలు పాత్రకి నంది అవార్డు వచ్చింది.

మళ్లీ సినిమాల వైపు ఎప్పుడొచ్చారు?
ముగ్గురు పిల్లల్నీ (ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు) ఇంజినీర్లను చేశాను. వాళ్లకు ఇంజినీర్లనిచ్చే పెళ్లి చేశాను. బాధ్యతలు తీరిపోయాయి కాబట్టి మళ్లీ నా దృష్టి సినిమాలవైపు మరల్చాను. ఇంతలో కొన్ని సీరియల్స్‌లో అవకాశాలు వచ్చాయి. అవి చేస్తున్నప్పుడే క్రిష్ ‘వేదం’లో అవకాశమిచ్చారు. ఆపైన మహాత్మ, బావ, వేగుచుక్కలు సినిమాల్లో చేశాను.

‘రాజన్న’లో అవకాశం ఎలా వచ్చింది?
ఓ రోజు అన్నపూర్ణ స్టూడియో నుంచి కబురు వచ్చింది. వెళ్లేసరికి దర్శకులు విజయేంద్రప్రసాద్, కో-డెరైక్టర్ ఆదుర్తి రవి, నాగచైతన్య తదితరులు ఉన్నారు. సాంబయ్య తాత పాత్ర కోసం స్క్రీన్ టెస్టులు చేశారు. తర్వాత వర్మగారు...

‘నీకు నెలరోజులు టైమిస్తున్నాను.
బాగా గడ్డం పెంచి, ఐదారు కిలోల బరువు తగ్గి కనిపించు’ అన్నారు. నేను ఒకపూటే భోజనం చేసి ఐదు కిలోలు తగ్గి,
పెరిగిన గడ్డంతో వెళ్లాను. నన్ను సెలెక్ట్ చేశారు. దాంతో నా జీవితం మలుపు తిరిగింది.

‘రాజన్న’లో మీ పాత్రకు స్పందన...?
అంతా సాంబయ్య తాత సాంబయ్య తాత అంటుంటే ఎంత సంతోషంగా ఉందో! ముఖ్యంగా ‘తెలుగు ఇండస్ట్రీకి తెలుగువాడైన ఓ మంచి క్యారెక్టర్ నటుడు దొరికాడు’ అంటూ కొందరు పెద్దలు మనస్ఫూర్తిగా ప్రశంసిస్తుంటే నాకు కలిగిన ఆనందం వర్ణనాతీతం. ఇంకో విషయమేంటంటే... ఆ సినిమా తర్వాత గడ్డం లేకపోతే నన్నెవరూ గుర్తు పట్టట్లేదు. అదీ ఆ పాత్ర నాకు తెచ్చిన గుర్తింపు!


మరి మీ ఇంట్లో వాళ్ల స్పందన ఏమిటి..?
నా భార్య నాలుగేళ్లక్రితమే చనిపోయింది. తను మొదట్నుంచీ నన్ను చాలా ప్రోత్సహించేది. ఈ రోజు నా ఆనందాన్ని పంచుకోడానికి తను లేదు. పిల్లలు మాత్రం నా విషయంలో ఆనందంగా ఉన్నారు.

ప్రస్తుతం అవకాశాలు ఎలా ఉన్నాయి?
‘రాజన్న’ తెచ్చిన పేరుతో కెరీర్ ఊపందుకుంది. ‘ఆటోనగర్ సూర్య’లో హీరో నాగచైతన్యను పెంచి పెద్దచేసే వ్యక్తిగా పూర్తి నిడివి ఉన్న పాత్రను ఇచ్చారు దర్శకుడు దేవా కట్ట. నాని కృష్ణ దర్శకత్వంలో ‘దేవరాయ’, రాఘవేంద్రరావు గారి ‘షిరిడీ సాయి’ చిత్రాల్లో కూడా నటిస్తున్నాను. మరో ఐదారు అవకాశాలు చేతిలో ఉన్నాయి.

ఆకెళ్ల, పూసల లాంటివారు నాటకాల్లో నాకంటూ ఓ స్థానాన్ని కల్పించుకోడానికి మార్గం చూపితే... విజయేంద్రప్రసాద్, కీరవాణి, నాగార్జున, రాజమౌళి, క్రిష్, కృష్ణవంశీ, రాంబాబు (‘బావ’ దర్శకుడు) లాంటి వారంతా సినిమా రంగంలో నాకో స్థానం కల్పించారు. నాకీ అవకాశాన్ని కల్పించిన వాళ్లందరికీ నేనెప్పటికీ రుణపడి ఉంటాను.

1 కామెంట్‌: