5, ఏప్రిల్ 2011, మంగళవారం

కొత్త మార్కెట్‌లోకి కుర్ర హీరోలు ,

ప్రశ్న: రజనీకాంత్, కమలహాసన్, విక్రమ్, సూర్య, విజయ్...ఆఖరికి విశాల్-వీళ్లకు ఉన్నది మన తెలుగు హీరోలకు లేనిది ఏమిటో చెబుతారా?
జవాబు: వెరీ సింపుల్...పక్క రాష్ట్రాల్లో మార్కెట్.
సినిమా నిర్మించడం ఒక ఎత్తయితే...దాన్ని అమ్ముకోవడం మరో ఎత్తు. ఇక్కడే నిర్మాతలు ఎత్తుకు పైఎత్తు వేయాలి. పక్కవాళ్లని ఆకట్టుకోవడానికి జిమ్మిక్కులు వేయాలి. రజనీకాంత్, కమలహాసన్‌కి ఉన్న గుర్తింపు తెలియనిది కాదు. ‘రోబో’ సినిమా వస్తుందేమో అని ఝడుసుకుని మన సినిమాల్ని వాయిదా వేసుకున్న వైనం మనం ఎప్పటికీ మర్చిపోం. విక్రమ్, సూర్య లాంటి తమిళ హీరోలు కూడా తెలివి నేర్చుకున్నారు. తమ భాషలో ఓ సినిమా ఒప్పుకున్నారంటే తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాల్ని దృష్టిలో పెట్టుకుని కథలు ఎంచుకుంటున్నారు. అవసరమైతే రెండు మూడు సన్నివేశాల్ని హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. తెలుగు నేటివిటీ అద్దే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు తెరకు తెలిసిన అమ్మాయిని నాయికని చేస్తున్నారు. ‘ఇది తెలుగు సినిమానే...’ అన్నట్లు ప్రచారం సాగిస్తున్నారు. దానితో తెలుగులో వారి సినిమాల్ని సులభంగా విడుదల చేసుకునే వీలు చిక్కుతుంది. మన నిర్మాతలు కూడా అంతే. సూర్య సినిమా ఏనాటికైనా మరో ’గజిని’ కాకపోతుందా? విక్రమ్ మరోసారి ‘అపరిచితుడు’లా ఆకట్టుకోపోతాడా అనే ఆశల్లో అనువాద హక్కుల్ని ఎక్కువ మొత్తాలు చెల్లించి కొనుక్కుంటున్నారు. అందుకే వాళ్ల మార్కెట్ వర్ధిల్లుతోంది. తమ సినిమాలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించుకోగలుగుతున్నారు. రజనీకి పక్క రాష్ట్రాల్లో మార్కెట్ లేకపోతే ‘రోబో’ కోసం రు.150 కోట్లు ఖర్చు పెట్టేవారా? ఆ సినిమా అంతకుమించి వసూళ్లు రాబట్టేదా? అందుకే యధా మార్కెట్-తథా లాభం.
అంతెందుకు? మాధవన్‌నే తీసుకోండి. తమిళం, హిందీ, తెలుగులో ఈ హీరోకి మంచి మార్కెట్ ఉంది. మన యువ హీరోలకు ఉన్నంత క్రేజ్ మాధవన్‌కీ ఉంది. తక్కువ బడ్జెట్ హీరోనే అయినా తన సినిమాని తమిళంలోను, తెలుగులోను విడుదలచేసి నిర్మాతల సొమ్ము చేసుకుంటున్నారు. తమిళ నటుడు విక్రమ్ సినిమాకి రూ.40 కోట్లు బడ్జెట్ ఎందుకు వెచ్చించగలుగుతున్నారు? తెలుగులో డబ్బింగ్ హక్కుల కింద కనీసం రూ.5 కోట్లయినా రాకపోతుందా? అనే ఆశతో. ఉపేంద్ర సినిమా అంటే-బిసి సెంటర్లు నిండిపోతాయి. ఓ కన్నడ హీరో ఇక్కడ మార్కెట్‌ని ఎలా దక్కించుకోగలిగాడు? మనవాళ్లని ఎలా ఆకట్టుకుంటున్నాడు... మరదే మార్కెట్ అంటే. మార్కెట్‌ని అర్ధం చేసుకోవడం ఒక కళ. దాన్ని పొరుగింటి కథానాయకులు బాగా పట్టేశారు. హీరోల మార్కెట్ పెంచుకునేందుకే కాదు... నష్టాల శాతం తగ్గించుకోవడానికి కూడా ఇదెంతో ఉపయోగపడుతుంది.
ఈ సూత్రం ఇప్పుడిప్పుడే మన హీరోలు కూడా అర్ధం చేసుకుంటున్నారు. తమిళ, మలయాళ భాషల్లో తమ సినిమాని విడుదల చేసుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయ్...ఁవేడి వేడి తెలుగు సిన్మాలండీ’ అంటూ పక్క రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ దిశగా తొలి అడుగులు వేసింది...అల్లుఅర్జున్. తన సినిమాలకు కేరళలో మంచి డిమాండ్ ఉంది. ‘దేశ ముదురు’ అక్కడనుంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత బన్నీ నటించిన అన్ని సినిమాలనూ కేరళలో ఎక్కువ ప్రింట్లతో విడుదల చేశారు. కేరళ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా తేలిక. ఎందుకంటే ఇక్కడున్న కమర్షియల్ విలువలు అక్కడ ఉండవు. ఇంత ఖర్చు కూడా పెట్టరు. అక్కడ భారీ బడ్జెట్ సినిమా అంటే మహా అయితే రు. 4,5 కోట్లు మించదు. ఆ డబ్బు మన పెద్ద హీరోల పారితోషికానికి కూడా సరిపోదు. అందుకే తెలుగు సినిమాల్లో కనిపించే హంగులు వారికి బాగా నచ్చుతాయి. ‘వరుడు’ సినిమాని కూడా అత్యధిక ప్రింట్లతో విడుదల చేశారు. ‘బద్రీనాథ్’ను కూడా కేరళలో భారీ ప్రింట్లతో విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది.
నాగార్జున తమిళ మార్కెట్‌ని అర్ధం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ‘గగనం’ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. ఈ విధానం ‘గగనం’ లాంటి ప్రయోగాత్మక సినిమాలకు బాగా ఉపయోగపడుతుంది. ఒకేసారి రెండు భాషల్లోనూ సినిమాని తెరకెక్కించడం వల్ల బడ్జెట్‌ని అదుపులో పెట్టుకోవచ్చు. రెండు రాష్ట్రాల్లోనూ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటే చాలు. సినిమా సేఫ్ జోన్‌లో పడిపోతుంది. ‘గగనం’ మంచి సినిమా అని పేరు తెచ్చుకున్నా వసూళ్లు అంతంత మాత్రమే. తమిళంలో కూడా విడుదల చేశారు కాబట్టే నష్టాలు లేకుండా పెట్టుబడి రాబట్టుకోగలిగారు. నాగ్ తరువాతి సినిమాలు తమిళంలో విడుదల చేయడానికి ఈ సినిమా బీజం వేసింది. ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాతో తమిళ హీరోలకు తమ స్టామినా చూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామ్‌చరణ్ ‘మగధీర’ తమిళంలో విడుదల కావాల్సింది. అయితే కొన్ని కారణాలవల్ల అనువాదం ఆలస్యం అవుతోంది. నవ్వు కధానాయకుడు నరేష్‌కీ తమిళ మార్కెట్ మీద దృష్టి పడింది. అక్కడ ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. ‘అలా మొదలైంది’ సినిమాతో మరో హిట్టు తన ఖాతాలో వేసుకున్న నాని తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. మార్కెట్‌ను విస్తరించుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో మన హీరోలకు ఇప్పుడే తెలిసింది. అయితే ఫలితాలు అంత త్వరగా రావు. ఓ ‘గజని’, ఓ ‘అపరిచితుడు’ మన బాక్సాఫీసుని కొల్లగొట్టేముందు...చాలా సినిమాలు మన సహనాన్ని పరీక్ష పెట్టాయి. విజయం కోసం ఓపిగ్గా ఎదురు చూడాల్సిందే. తెలుగు హీరోలూ...విజయోస్తు.
- సాహితి 

Source: March 31st, 2011, ఆంధ్రభూమి, వెన్నెల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి