5, ఏప్రిల్ 2011, మంగళవారం

దొంగల ముఠా రివ్యూ

* దొంగల ముఠా (బాగోలేదు) దెబ్బకు ఠా!

తారాగణం:
రవితేజ, ఛార్మి, మంచు లక్ష్మీప్రసన్న
ప్రకాష్‌రాజ్, సునీల్, బ్రహ్మానందం
సుబ్బరాజు తదితరులు.
సంగీతం: అమర్ మొహలి
నిర్మాణం: శ్రేయా ప్రొడక్షన్స్
నిర్మాత: కిరణ్‌కుమార్‌కోనేరు
దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ
సినిమా అన్నది నవరసాల మేలు కలయిక. కథా కథనం సంగీతం, సాహిత్యం నటీనటులు సాంకేతిక నిపుణుల టాలెంట్‌కు దర్శకుడు తన ప్రతిభను జోడించి జనరంజకంగా మలచగలగాలి. రామ్‌గోపాల్‌వర్మ పద్ధతి దీనికి విరుద్ధం. చిత్రం నిర్మాణ దశలోనే సంచలన టైటిల్స్, వివాదాస్పద ప్రకటనలతో వివాదాలు సృష్టిస్తూ పబ్లిసిటీ పరంగా బిజినెస్ చేసుకోవడం అతని పాలసీ. అందుకే వర్మ తనమాట మీద నిలబడిన దాఖలాలు కనపడవు. గతంలో ‘గోవిందా గోవిందా’ సెన్సార్ ఇబ్బందులకు గురైనప్పుడు కలత చెంది ఇకపై తెలుగు సినిమాకి దర్శకత్వం వహించనని ప్రతిజ్ఞ చేశాడు. ప్రేక్షకులు వర్మ చిత్రాలు కావాలని అందోళనలు గట్రా చేయలేదు. కానీ వర్మ తన మనసు మార్చుకుని ఒట్టుతీసి గట్టుమీద పెట్టి సంచలనాల ప్రకటనలతో రక్తచరిత్ర, అప్పల్రాజు, దొంగలముఠా లాంటి మూడు ఫ్లాప్‌లతో హ్యాట్రిక్ సాధించుకున్నాడు. సిక్సర్‌వైపు చూడకపోతే చాలు.
తాజా చిత్రం దొంగలముఠా కథ విషయానికి వస్తే..సుధీర్ (రవితేజ) భార్య రాణి (ఛర్మి)తో కలిసి ఒక వివాహానికి హాజరయ్యేందుకు కారులో ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో సాంకేతిక కారణాలవల్ల కారు ఆగిపోతుంది. ఒక మెకానిక్ దొరుకుతాడని దగ్గర్లో వున్న ఒక రిసార్ట్ చేరుకుని మెకానిక్ కోసం వాకబు చేయగా నలభై మైళ్లు ప్రయాణిస్తేనే కానీ మెకానిక్ దొరకడు అని సమాధానం రావడంతో అక్కడే రూమ్ తీసుకుని బస చేస్తాడు. అక్కడి సిబ్బంది ప్రవర్తన కూడా వింతగా ఉంటుంది. పక్క రూమ్‌నుంచి వింత వింత శబ్దాలతో అందులో దెయ్యం ఉంది అన్న అభూతకల్పనతో కొన్ని రీళ్లు సాగుతాయి. ఆ రిసార్ట్‌లో ఒక దొంగల ముఠా బసచేసి ఉంటుంది. నారాయణమూర్తి అనే బిజినెస్ మాన్‌ను కిడ్నాప్ చేసిన దొంగల ముఠా ఆ రూమ్‌లోనే బసచేసి ఉంటుంది. ఆ దొంగల ముఠాను పట్టుకోవడానికి పోలీస్ ఉన్నతాధికారి (మంచు లక్ష్మీప్రసన్న) హోటల్‌కు చేరుకుంటుంది. సుధీర్ దంపతులకు దొంగల ముఠాకు దోబూచులాట మొదలవుతుంది. ఈ చర్య ప్రేక్షకులను విసుగెత్తించి విసిగెత్తించి ఆఖరున దొంగలముఠా సుధీర్ సహాయంతో పోలీసులకు లొంగిపోవడంతో కథ సమాప్తమవుతుంది. ఇది వర్మ ఐదురోజులలో ఐదు నిమిషాల కథతో నిర్మించిన తెలుగు సినిమా.
ఈ 12 రీళ్ల బాగోతంలో రవితేజ, ఛార్మి, మంచులక్ష్మీప్రసన్న, ప్రకాష్‌రాజ్, సుబ్బరాజు, బ్రహ్మానందం, సునీల్ వగైరా వగైరా పాల్గొన్నా ఏ ఒక్కరి నటన గురించి ప్రత్యేకంగా రాయవలసింది ఏంలేదు. ఎవరికీ గుర్తుంచుకోదగ్గ సంభాషణలు లేవు. ప్రేక్షకులకు మరో అదృష్టం పాటలు లేవు (పెద్ద రిలీఫ్). థియేటర్‌నుంచి బయటకు వచ్చిన ప్రతీ ప్రేక్షకుడు కథ ఏమిటో అర్ధం కాక బుర్ర గోక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భోజనం అంటే కేవలం అన్నం మెతుకులు మాత్రమే కాదు. దానికి తగ్గ రుచికరమైన వంటకాలు ఉంటేనే ఎవరైనా తృప్తిగా భోజనం చేయగలరు. రుచికరమైన అధరువులు ఎక్కువగా ఉంటే అది విందు భోజనంలా భావించి ఆరగించినవారు తృప్తి పడతారు. సినిమా కూడా అంతే. చిత్రంలో నవరసాలు పండించినపుడే ప్రేక్షకుడు ఆనందపడి మరీ మరీ చూస్తాడు. అరవై సంవత్సరాల క్రితం విడుదలైన పాతాళ భైరవి ఇవన్నీ ఉండడంవల్లనే అలనాడు అఖండ విజయం సాధించి నేటికీ మరీ మరీ గుర్తు చేసుకుని వేడుక చేసుకుంటున్నారు. నా సినిమా నా ఇష్టం. మీ కిష్టం అయితే చూడండి లేకపోతే మానేయండి. మిమ్మల్ని ఎవరూ బలవంతపెట్టలేదు కదా అని ఓ దర్శకుడు అనడం ఎంతవరకు సమంజసం? సినిమా ఎన్నిరోజులలో పూర్తి చేసారు. కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారా? హీరో హీరోయిన్‌కి ఎన్ని కోట్లు ఇచ్చారు? అన్నది ప్రేక్షకులకు అనవసరం. కథ బాగుందా, పాటలు బాగున్నాయా, నటీనటుల సాంకేతిక నిపుణుల టాలెంట్‌తో చిత్రాన్ని వినోద భరితంగా తీర్చిదిద్దారా లేదా అన్నది ముఖ్యం. భార్యా భర్తల జంట దొంగల ముఠాతో హోటల్ చుట్టూ తిరుగుతూ దోబూచులాట ఆడి ఆఖరున వాళ్లను పట్టించడంలోఏమిటి ప్రత్యేకత. పెట్టుకున్న విగ్గు చెడకుండా ఒంటి చేత్తో వందమంది రౌడీలను చిత్తుచేసి టాటా సుమోలను మోకాలు అడ్డుపెట్టి పల్టీలు కొట్టించగల సాహస కృత్యాలు చేసే హీరోల కథలకు అలవాటుపడ్డ ప్రేక్షకులు ఒక చిన్న ముఠాను హీరో ఎదుర్కోవడంలో ఏమి థ్రిల్ ఫీల్ అవుతారు. అప్పల్రాజులో వర్మ స్వయంగా రాయించుకున్న పాటలో దయ్యాల సినిమాలు తీసే వర్మ ఒక దర్శకుడా మన ఖర్మ అన్న మాట అక్షరాలా నిజమే అని తెలుగు ప్రేక్షకులు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.
రాజేష్‌ఖన్నా సూపర్‌స్టార్‌గా ఉన్న రోజుల్లో బి.ఆర్ చోప్రా తక్కువ నిడివిగల హిందీ చిత్రం ‘ఇత్త్ఫోక్’ నిర్మించాడు. ఇంటర్‌వెల్ వరకు బొంబాయి షణ్ముఖ ఆనంద్ హాల్‌లో ఆ చిత్రం ప్రీమియర్ షోను చూపించాడు. హిందీ చిత్రసీమకు చెందిన అగ్రశ్రేణి తారాగణం హాజరైన ఈ షోకు అమీన్ సాయి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. తక్కువ నిడివిగల ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. అదే పద్ధతిలో వర్మ దొంగలముఠా చిత్రం పూర్తికాగానే ఆ చిత్రం ట్రైలర్స్ ప్రదర్శించి బిఆర్ చోప్రాను అనుకరించాడు. ఇది కూడా వర్మ స్వంత ఆలోచన కాదు. కాపీ ఆలోచనే. పైగా ఆ ట్రైలర్స్ అన్నీ టివి చానల్స్‌లో రోజూ చూసేవే. ఒక దొంగల ముఠా బ్యాంకుదోపిడీ చేసి ఖజానా దోచుకున్నా, ఇంటిపై దాడిచేసి విలువైన వస్తువులను దోచుకున్నవారిని శిక్షించడానికి ఒక చట్టం ఉంది. ప్రేక్షకుల విలువైన సమయాన్ని జేబులను దోచుక్ను ఈ సినీ (దర్శక) దొంగలను శిక్షించడానికి సినిమాటోగ్రఫీ యాక్టులో కూడా చట్టం సవరించి సరికొత్త రూల్‌ను అమలుపరిస్తే ప్రభుత్వానికి వినోదపు పన్ను ద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్న ప్రేక్షకులను కాపాడినవారవుతారు. చిత్ర నిర్మాణంలో సంచలన ప్రకటనలు చిత్ర విజయానికి ఏ విధంగా ఉపయోగపడవు అన్న విషయం పరిశ్రమ వర్గాలు గుర్తించడం మంచిది.

- పర్చా March 24th, 2011, ఆంధ్రభూమి, వెన్నెల


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి