5, ఏప్రిల్ 2011, మంగళవారం

రాజ్ సినిమా రివ్యూ

* రాజ్
సరుకు తక్కువ సరసం ఎక్కువ!
తారాగణం:
సుమంత్, ప్రియమణి, విమలారామన్, అలీ
గిరిబాబు, వైజాగ్ ప్రసాద్
అజయ్, శ్రీనివాసరెడ్డి తదితరులు
కెమెరా: కె.వి.కృష్ణారెడ్డి
సంగీతం: కోటి
నిర్మాణం: కుమార్ బ్రదర్స్ పతాకం
నిర్మాత: కుమార్ బ్రదర్స్
దర్శకత్వం: వి.ఎన్.ఆదిత్య
ఏమాటకామాట చెప్పుకోవాలి. ‘రాజ్’ తీసిన నిర్మాత ధైర్యాన్ని మెచ్చుకోవాలి. తమ దగ్గర కత్తిలాంటి కథ ఉన్నా-‘ఎందుకు లెద్దూ...రిస్కు’ అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్న రోజులివి. అలాటిది ఎప్పుడో బిసి కాలం నాటి కథ...అందులోను మనదర్శకులంతా అరగ్గొట్టి పీల్చి పిప్పిచేసిన సన్నివేశాల్ని నమ్ముకుని, బోల్డెంత బడ్జెట్టు పెట్టి అందులో హిట్టులేని హీరోని పెట్టి, తనకి జోడీగా ఇద్దరు పసందైన హీరోయిన్లను పెట్టి గోవా, కులీమనాలీ చోట్ల పాటలుపెట్టి...మళ్లీ సినిమా తీసారంటే గొప్పవిషయమే కదా! ఆ ధైర్యం ఎవర్ని చూసుకుని? ఇది మీకు తెలిసిన కథే అయినా మళ్లీ ఓసారి గుర్తు చేసుకోవడం ధర్మం కాబట్టి...కథలోకి వెడదాం. రాజ్ (సుమంత్) ఓ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. మైథిలి (ప్రియమణి)తో పెళ్లి కుదురుతుంది. ముహుర్తం పెట్టుకునేలోగా రాజ్‌కి ప్రియ (విమలారామన్) పరిచయమవుతుంది. గోవా ట్రిప్పులో ఇద్దరూ మానసికంగా దగ్గరవుతారు. హోటల్ రూమ్‌లో శారీరకంగా కూడా దగ్గరై-రాజ్ తన మనసులోని మాట చెప్పేలోగా ప్రియ మాయమైపోతుంది. ఈలోగా రాజ్ ఇంట్లో వాళ్లు బలవంతం చేసి మైథిలితో పెళ్లి చేసేస్తారు. అయితే రాజ్ ప్రియని మర్చిపోలేక తన జ్ఞాపకాల్లోనే ఇసురోమంటూ కాలం గడుపుతుంటాడు. తొలిరాత్రి... ‘ఇద్దరం మానసికంగా దగ్గరైన రోజే మన శోభనం’ అని తన మనసులో మాట చెప్పేస్తారు. అయితే మైథిలి చిట్టిపొట్టి డ్రస్సులతో రెచ్చగొట్టేసరికి రాజ్ ప్రేమా, పాడా అనుకుని మిగిలిన ఆ కార్యం కూడా కానిచ్చేస్తాడు. ఇద్దరూ దగ్గరైపోయే సమయంలో రాజ్‌కి ప్రియ కనిపించినట్టే కనిపించి మళ్లీ మాయమైపోతుంది. రాజ్ లండన్ వెడుతున్నాను అని చెప్పి హైదరాబాద్‌లోనే ఉండి ప్రియను వెదికేపనిలో పడతాడు. అయితే ప్రియ దొరికిందా? మైథిలికి ఈ విషయం ఎలా తెలిసింది అనే సంగతులు రెండో భాగంలో చూసి తరించాలి.
ఈ ధైర్యం ఎవర్ని చూసుకుని- అని ముందు వాక్యాల్లో ఆపేం కదా...ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాం. ఆ ధైర్యం ప్రియమణి-విమలారామన్‌లను చూసే. ఆ విషయం తొలిసన్నివేశాలు చూస్తే అర్ధమైపోతుంది. ఘాటైన సన్నివేశాల్లో, లిప్‌లాక్ ముద్దులతో నాయికలిద్దరూ పోటీపడి మరీ నటించారు. తొలిపాటే సముద్రం ఒడ్డున శృంగార భరితంగా సాగుతుంది. శోభనం గదిలో ప్రియమణి వస్తధ్రారణ గమనిస్తే చాలు...దర్శకుడి మోటివ్ ఏమిటో తెలిసిపోతుంది. ఆ సన్నివేశంలో ప్రియమణి అచ్చమైన వ్యాంప్‌గా కనిపిస్తుంది. పెళ్లయిన రెండు మూడు రోజులకు భర్త మందు తాగుతుంటే సోడా వేసి, చిప్స్‌అందించే భార్య ఎంతమందికి దక్కే అదృష్టమో! అక్కడ ప్రియమణి డ్రస్సింగ్ ముందు వ్యాంప్‌లు కూడా దిగదుడుపే. ఈ సందర్భంలో సాగే రెండో పాటలోను ప్రియమణి మరింత రెచ్చిపోయింది. విమలారామన్ కూడా ఏమాత్రం తీసిపోదు. ఇలాంటి మాస్ సన్నివేశాలుంటే థియేటర్లు హౌస్‌ఫుల్ అనే భ్రమలో నిర్మాతలు ఉన్నంత కాలం ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి.
ఇక హీరో గురించి చెప్పుకోవాలి కాబట్టి సుమంత్ నటన ప్రస్తావించుకుందాం. సుమంత్ ఈ సినిమాతో తెలుగు తెర ఇమ్రాన్ హష్మీగా మారి పోయాడు. ప్రియమణి, విమలారామన్ ఇద్దరికీ లిప్‌లాక్ కిస్సులిచ్చి ఆ బాలీవుడ్ ముద్దుల హీరోను ఓసారి గుర్తుచేశాడు. ఆ ముద్దులిచ్చే సందర్భాల్లో తప్ప మిగిలిన సన్నివేశాల్లో సుమంత్‌నుంచి ఒక్కటంటే ఒక్క ఎక్స్‌ప్రెషనూ చూళ్లేం! పతాక సన్నివేశాల్లో మరీ ఘోరం. ప్రియమణి ఇంటికెళ్లి... ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతోనే నా జీవితం’ అంటూ డైలాగులు చెప్పే సన్నివేశం-సుమంత్ నటుడిగా ఇంకా ఎంత ఎదగాలో తేల్చి చెబుతుంది. పాటల్లో ఎక్సర్‌సైజులు చేసి..అదే డాన్స్ అనిపించాడు.
ఈ సినిమాకోసం ఇద్దరు దర్శకులు మారారు కాబట్టి...ఎవరిని నిందించాలో, ఎవరిని మెచ్చుకోవాలో అర్ధం కాదు. ప్రేమ అనేది పక్క పంచుకోవడంతోనే పరిపూర్ణం అవుతుందనే భావన ఇంజెక్టు చేయడానికి ఈ సినిమా కూడా తనవంతు సహకారం చేసి, ఆ పాపంలో వాటా పంచుకుంది. రాజ్-ప్రియలు పరస్పరం ఐలవ్‌యూ చెప్పుకోరు కనీసం నువ్వంటే నాకిష్టం అనుకోరు. అన్నిటికంటే శారీరక సుఖం అన్నట్టు ప్రవర్తిస్తారు. భార్య స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేస్తుంటే..్భర్త తినేసేలా చూడడం మరీ కృతకంగా ఉంది.
సాంకేతిక వర్గం అరకొర ప్రతిభే చూపింది. కోటి తన బాణీ మర్చిపోయిన సంగతి ఈ పాటలు వింటే అర్ధమవుతుంది. ‘్భమవరం బుల్లోడా’ పాటకు కూడా సరైన న్యాయం చేయలేదేమో అనిపించంది. ‘ఘరానా బుల్లోడు’లో ఆమని బిందెల మధ్య చాలా అందంగా కనిపించింది. ఇక్కడ ఇద్దరు నాయికలున్నా పాటలో ఆకర్షణ లేదు. మాటల్లో ఒకటీ హృదయంలో నాటుకపోదు. ‘ఆర్ యు రిలాక్సింగ్’ జోకు ఎస్సెమ్మెస్‌ల్లో చదివేసిందే. అలీ కూడా నవ్వించడంలో విఫలమయ్యాడు. ఉనంతలో శ్రీనివాసరెడ్డి కాస్త నయం. ఓ అబ్బాయి ఇద్దరమ్మాయిల కథలు ఇదివరకు ఎందుకు హిట్ అయ్యాయంటే కారణం ఒకటే. ఆ సినిమా

-సాహితి March 24th, 2011, ఆంధ్రభూమి, వెన్నెల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి